ఎకరా కనిష్టంగా రూ.6 లక్షలు! | All set for revision of government land values ​​in Telangana | Sakshi
Sakshi News home page

ఎకరా కనిష్టంగా రూ.6 లక్షలు!

Apr 26 2026 1:21 AM | Updated on Apr 26 2026 1:23 AM

All set for revision of government land values ​​in Telangana

రాష్ట్రంలో భూముల ప్రభుత్వ విలువల సవరణకు రంగం సిద్ధం

ఆయా ప్రాంతాల్లో డిమాండ్‌ ఆధారంగా భూముల విలువల సవరణ 

బహిరంగ మార్కెట్‌లో ఉన్న రేటులో 50–60 శాతం పెంచే యోచన 

గరిష్టంగా 100% మించొద్దనే నిబంధన... ప్లాట్ల విలువలు 30–50% 

గరిష్టంగా 50 శాతం పెంపునకు అనుమతి... చదరపు అడుగు కనిష్ట విలువ రూ.1,600కు పెంపు? 

‘గ్రేటర్‌’లో కనీసం రూ. 3 వేలు.. గరిష్టంగా రూ.12 వేలకు పెంపు

ఓఆర్‌ఆర్‌ పరిధిలోని 39 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో భారీగా పెంచే అవకాశం... ఏటా రూ.3 వేల కోట్ల వరకు ఆదాయం పెరుగుతుందని అంచనా... త్వరలోనే తుది నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో మరోమారు భూముల ప్రభుత్వ విలువల సవరణకు రంగం సిద్ధమవుతోంది. వచ్చే నెల మొదటి వారంలో సవరించిన భూముల విలువలను అమల్లోకి తేవాలని ఆదాయ వనరుల సమీకరణపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం తాజా ఆదేశాల నేపథ్యంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఇందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈసారి భూముల విలువల సవరణను సానుకూలతను బట్టి చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లో విలువల సవరణకు ఉన్న డిమాండ్‌ ఆధారంగా కొత్త విలువలను నిర్ధారించాలని ఇప్పటికే క్షేత్రస్థాయి యంత్రాంగానికి సూచనలిచ్చింది. ఈమేరకు ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల నుంచి ప్రతిపాదనలు వచ్చాయని, వీటిని థర్డ్‌ పార్టీ రూపొందించిన అంచనాలతో పోలుస్తున్న ఉన్నతాధికారులు సవరించిన విలువల నిర్ధారణలో తుది అంకానికి చేరుకున్నట్లు తెలుస్తోంది.  

ఉదారంగా... ఉన్నఫళంగా కాకుండా 
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో జరుగుతున్న చర్చ ప్రకారం ఈసారి వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువలను ఉదారంగానే పెంచనున్నట్టు తెలుస్తోంది. మైదాన ప్రాంతాల్లో ప్రస్తుతం వ్యవసాయ భూమి ఎకరం కనిష్ట విలువ రూ.3 లక్షలుండగా, దాన్ని 100 శాతం పెంచి రూ.6 లక్షలుగా నిర్ధారించనున్నారు. వ్యవసాయ భూముల ప్రభుత్వ విలువల పెంపు విషయంలో బహిరంగ మార్కెట్‌లో ఉన్న రేట్లను పరిగణనలోకి తీసుకున్నారు. బహిరంగ మార్కెట్‌లో ఉన్న భూమి రేటులో 50–60 శాతంగా విలువను సవరించాలని నిర్ణయించారు. అయితే, బహిరంగ మార్కెట్‌లో ఎకరం భూమి విలువ రూ.20 లక్షలుంటే అందులో 50–60 శాతం అంటే ప్రభుత్వ విలువను కనీసం రూ.10–12 లక్షల వరకు నిర్ధారించాల్సి ఉంటుంది. 

కానీ, ఉదారంగా పెంచాల్సిన పరిస్థితుల్లోనూ ఉన్నఫళంగా ఎక్కువ పెంచకుండా, ప్రస్తుతం ఉన్న విలువలకు గరిష్టంగా 100 శాతం మించకుండా సవరించిన విలువలు నిర్ధారించనున్నారు. అంటే బహిరంగ మార్కెట్‌లో రూ.20 లక్షలున్న ఎకరం భూమి ప్రభుత్వ విలువను గరిష్టంగా ప్రస్తుతమున్న విలువ కంటే 100 శాతం అదనంగా నిర్ధారించనున్నారు. బహిరంగ మార్కెట్‌లో 50–60 శాతం, ప్రస్తుత విలువ కంటే 100 శాతంలో ఏది తక్కువ ఉంటే దాన్ని నిర్ధారించనున్నారు. కొన్నిచోట్ల 100 శాతం కంటే అనివార్యంగా పెంచాల్సి ఉంటే అందుకు గల కారణాలను ప్రత్యేకంగా ప్రస్తావించి పెంచనున్నట్టు తెలుస్తోంది. ఇక, ఓపెన్‌ ప్లాట్ల విలువలు కూడా భారీగానే సవరించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం చదరపు గజానికి ఉన్న విలువలో 30–50 శాతం వరకు విలువలు సవరించనున్నారు.  

39 చోట్ల భారీగానే.. 
ఔటర్‌ రింగురోడ్డు (ఓఆర్‌ఆర్‌) పరిధిలోని 39 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అపార్ట్‌మెంట్లలోని ఫ్లాట్ల విలువలనూ భారీగానే పెంచనున్నారు. ఈ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో ఎక్కువగా ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లు జరగనున్న నేపథ్యంలో అవకాశాన్ని బట్టి కొత్త విలువలను నిర్ధారించనున్నారు. గ్రామీణ ప్రాంతాలతో సహా రాష్ట్రంలో ప్రస్తుతం అపార్ట్‌మెంట్‌ విలువ చదరపు అడుగు రూ.1,300 ఉండగా, దాన్ని రూ.1,600కు పెంచనున్నారు. ఓఆర్‌ఆర్‌ పరిధిలో రూ.2 వేల నుంచి రూ.9,800 వరకు అడుగు విలువ ఉండగా, దాన్ని కనీసం రూ.3వేల నుంచి రూ.12వేల వరకు పెంచే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద ఏటా రూ. 3వేల కోట్ల అదనపు ఆదాయమే లక్ష్యంగా ఈసారి రాష్ట్రంలో భూముల ప్రభుత్వ విలువలను సవరించనున్నట్టు రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. 
 
మొదటి వారంలో సాధ్యమేనా? 
రాష్ట్రంలో సవరించిన ప్రభుత్వ రిజిస్ట్రేషన్‌ విలువలను మే నెల మొదటి వారం నుంచి అమల్లోకి తేవాలని కేబినెట్‌ సబ్‌ కమిటీ ఇచ్చిన ఆదేశాల అమలు సాధ్యమవుతుందా అనే చర్చ రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాల్లో జరుగుతోంది. వాస్తవానికి, సవరించిన తుది విలువల నిర్ధారణ జరిగిన తర్వాత మున్సిపాలిటీలు, మండలాలు, జిల్లాల్లో ఏర్పాటు చేసిన కమిటీల ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. అనంతరం ప్రభుత్వ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి తోడు సబ్‌కమిటీ ఇచ్చిన ఆదేశాలు రెవెన్యూ మంత్రి దృష్టిలో ఉన్నాయా, లేదా అన్న సందేహాలు కూడా ఆ శాఖలో వ్యక్తమవుతున్నాయి. ఆ శాఖ కమిషనర్‌ ఎన్నికల విధుల్లో భాగంగా పశ్చిమబెంగాల్‌లో ఉండగా, ఆయన మే 5న రాష్ట్రానికి రానున్నారు. ఈ నేపథ్యంలో భూముల ప్రభుత్వ విలువల సవరణపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకున్నా, ఆమలుకు మాత్రం మరికొంత సమయం పడుతుందని తెలుస్తోంది.   

Advertisement
 
Advertisement
Advertisement