జగిత్యాల జిల్లా: కాంగ్రెస్ పార్టీ నుంచి జీవన్ రెడ్డి బీఆర్‌ఎస్‌లోకి వెళ్తారన్న ఊహాగానాల మధ్య జగిత్యాలలోని ఆయన ఇంటికి ఏఐసీసీ నేతలు వెళ్లారు. జీవన్ రెడ్డిని కలిసిన వారిలో నేషనల్ కో ఆర్డినేటర్, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ ప్రొ.కత్తి వెంకటస్వామి ఉన్నారు. పార్టీ మార్పు ప్రచారం వేళ ఈ భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.
జీవన్ రెడ్డిని బుజ్జగించడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. దాదాపు గంటకుపైగా చర్చలు కొనసాగాయి. నిన్న జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించి కీలక వ్యాఖ్యలు చేసిన తర్వాత రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది. జీవన్ రెడ్డి నిర్ణయంపై ఆసక్తి నెలకొంది. ఆయన పార్టీ మారడం ఖాయమని ప్రచారం జరిగిన వేళ నేరుగా ఆయన ఇంటికే వెళ్లి ఏఐసీసీ నేతలు చర్చిస్తున్నారు.
కాగా, నిన్న జీవన్ రెడ్డి మీడయా సమావేశంలో మాట్లాడుతూ.. జగిత్యాల ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నారో తెలియదు కానీ, ఆయనతో కలిసి పనిచేయాలని తనకు చెబుతున్నారని అన్నారు. అభివృద్ధి కోసం సర్కారుతో కలిసి పనిచేయడం తప్పులేదుకానీ హక్కులను కాలరాయడం, అభ్యర్థులను ఎంపిక చేయడం ఇవన్నీ కరెక్టేనా అని అడిగారు. పార్టీ మారాలని తనకు వచ్చిన ఆలోచనకు తనలోని ఆవేదనే కారణమని చెప్పారు.


