వైద్యారోగ్యశాఖలో డిప్యుటేషన్లు రద్దు | Abolition of deputations in medical department | Sakshi
Sakshi News home page

వైద్యారోగ్యశాఖలో డిప్యుటేషన్లు రద్దు

Feb 8 2024 4:18 AM | Updated on Feb 8 2024 3:34 PM

Abolition of deputations in medical department - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వైద్య, ఆరోగ్యశాఖలోని అన్ని డిప్యుటేషన్లను రద్దు చేశారు. తక్షణమే రద్దు ఆదేశా లు అమలులోకి వ చ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది. డిప్యుటేషన్లలో ఉన్న డాక్టర్లు, నర్సులు, ఇతర ఉద్యోగులు వెంటనే తమ ఒరిజినల్‌ పోస్టింగుల్లో చేరాలని హుకుం జారీ చేసింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్‌ ఎ.ఎస్‌.క్రిస్టినా చోంగ్తు బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు.

వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ) పరిధిలోని వైద్య సిబ్బంది తక్షణమే రిలీవ్‌ అయి బుధవారం సాయంత్రమే అసలు పోస్టింగ్‌ స్థలంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. వివిధ మెడికల్‌ కాలేజీల్లో పనిచేస్తున్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్‌ కేడర్‌లో ఉన్న డాక్టర్లను రిలీవ్‌ చేయాలని సంబంధిత అధికారులకు డీఎంఈ డాక్టర్‌ త్రివేణి మెమో జారీ చేశారు.

ఇక ప్రజారోగ్య సంచాలకుల పరిధిలోని వైద్య సిబ్బంది గురువారం సాయంత్రానికి తమ ఒరిజినల్‌ పోస్టింగ్‌లలో చేరాలని ప్రజా రోగ్య సంచాలకులు ఆదేశించారు. డిప్యుటేషన్లు లేదా వర్క్‌ ఆర్డర్లు రద్దయిన ఉద్యోగుల జాబితాను సంబంధిత విభాగాల అధిపతులు గురువారం సాయంత్రానికి సమర్పించాలని స్పష్టం చేశారు. తమ విభాగాల్లో డిప్యుటేషన్లలో ఎవరూ లేరన్న ధ్రువీకరణ పత్రాన్ని కూడా పంపాలని కోరారు. 

‘అవసరాల మేరకు డిప్యుటేషన్లు అంటూ’పైరవీలకు రంగం సిద్ధం... 
జిల్లా కలెక్టర్లు లేదా ప్రభుత్వం నుంచి రాతపూర్వక ఆమోదంతో అవసరాల మేరకు ఆయా శాఖల అధిపతులు డిప్యుటేషన్లు జారీ చేస్తారని వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్‌ క్రిస్టినా తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఒకవైపు డిప్యుటేషన్లను రద్దు చేస్తూనే ఈ మెలిక పెట్టడంలో ఆంతర్యమేంటన్న ప్రశ్న తలెత్తుతోంది. మళ్లీ డిప్యుటేషన్లు తీసుకోవడానికే ఈ మెలిక అన్న చర్చ జరుగుతోంది. 

2 వేల మందికిపైగా డిప్యుటేషన్లలోనే.. 
ఒక అంచనా ప్రకారం వైద్య,ఆరోగ్యశాఖలో జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో దాదాపు 2 వేల మందికి పైగా డిప్యుటేషన్లలో ఉంటారని తెలుస్తోంది. ఇప్పుడు వీటన్నింటినీ రద్దు చేయడం వెనుక కుట్ర ఉందన్న విమర్శలు వస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన డిప్యుటేషన్లను రద్దు చేసి, కొత్తగా ఇవ్వడం ద్వారా పైరవీలకు తెరలేపాలన్నదే కొందరు అధికారుల ఉద్దేశమన్న విమర్శలున్నాయి. ఆ మేరకు ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇచ్చారన్న చర్చ కూడా జరుగుతోంది. 

సొమ్ములు చేతులు మారేందుకేనా 
అవసరాల మేరకు ప్రభుత్వ రాతపూర్వక అనుమతితో డిప్యుటేషన్లు ఇవ్వొచ్చన్న నిబంధన పెద్ద ఎత్తున దుర్వినియోగం కానుందని అంటున్నారు. సాధారణ సిబ్బంది డిప్యుటేషన్లకు రూ.లక్ష, స్టాఫ్‌నర్సులకు రూ.లక్షన్నర, డాక్టర్లకు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలు డిమాండ్‌ ఉంటుంది.

అలా పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారేందుకే అన్ని డిప్యుటేషన్లను రద్దు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవసరాల మేరకు తీసుకోవచ్చని ఉత్తర్వులో చెప్పాల్సిన అవసరమేంటి? ఒకవేళ అవసరాలున్నచోట ఇప్పటికే ఉన్నవారిని తొలగించి వెనక్కు పంపించాల్సిన అవసరమేంటన్న వాదన కూడా వినిపిస్తోంది. 

ఆ 18 మంది డీఎంహెచ్‌వోల మాటేమిటి 
కాగా, డిప్యుటేషన్‌పై ఉన్న దాదాపు 18 మంది జిల్లా వైద్యాధికారులను (డీఎంహెచ్‌వో) వెనక్కు పంపించాలన్న ఆదేశాలు వెలువడలేదని ఒక అధికారి వెల్లడించారు. దీనికి కారణాలు ఏంటో అంతుబట్టడంలేదన్న వాదనలున్నాయి.  

ఉద్యోగులు... సంఘాల అభ్యంతరం 
ఒక్కరోజు కూడా సమయం ఇవ్వకుండా డిప్యుటేషన్లు రద్దు చేయడంతో ఒక్కసారిగా డాక్టర్లు, నర్సులు, ఉద్యోగులు ఉలిక్కిపడ్డారు. వివిధ ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా యి. విద్యా సంవత్సరం మధ్యలో ఉండటం, పదో తరగతి, ఇంటర్, ఎంసెట్‌ వంటి పరీక్షలు ఉన్న నేపథ్యంలో డిప్యుటేషన్లు రద్దు చేయడం వల్ల గందరగోళం నెలకొంటుందని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు.

తక్షణమే అమలు చేయడం వల్ల వివిధ ప్రాంతాలకు వెళ్లడం, అక్కడ ఏర్పాట్లు చేసుకోవడం కష్టమవుతుందని అంటున్నారు. ప్రభుత్వం తన ఆదేశాలను వచ్చే జూన్‌ వరకు నిలి పివేయాలని కోరుతున్నారు. కొంతమంది దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, స్పౌజ్‌ గ్రౌండ్లలో ఉన్న వారికి కూడా అవకాశం ఇవ్వకుండా డిప్యుటేషన్లు రద్దు చేయడం సమంజసం కాదంటున్నారు. విద్యా సంవత్సరం పూర్తయ్యేవరకు సమయం ఇవ్వాలని, సాధారణ బదిలీలను చేపట్టాలని కోరుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement