ఆరు జిల్లాల్లో 94.4 శాతం పల్స్‌ పోలియో పూర్తి | 94. 4 Percent pulse polio completed in six districts telangana | Sakshi
Sakshi News home page

ఆరు జిల్లాల్లో 94.4 శాతం పల్స్‌ పోలియో పూర్తి

Oct 13 2025 5:38 AM | Updated on Oct 13 2025 5:38 AM

94. 4 Percent pulse polio completed in six districts telangana

పోలియో చుక్కలకు తొలిరోజు అనూహ్య స్పందన 

బూత్‌ డ్రైవ్‌లో 16.35 లక్షల మంది చిన్నారులకు పోలియో డ్రాప్స్‌ 

మిగిలినవారి కోసం నేడు, రేపు ఇంటింటికీ స్పెషల్‌ టీంలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆరు జిల్లాల్లో ఆదివారం చేపట్టిన సబ్‌ నేషనల్‌ ఇమ్యునైజేషన్‌ డే (ఎస్‌ఎన్‌ఐటీ) పల్స్‌ పోలియో కార్యక్రమం మొదటిరోజు విజయవంతంగా ముగిసింది. బూత్‌ డే యాక్టివిటీలో భాగంగా మొత్తం 16,35,432 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. నిర్దేశించుకున్న 17,32,171 మంది పిల్లల లక్ష్యంలో మొదటిరోజే 94.4% పూర్తి చేసినట్లు హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ అండ్‌ మిషన్‌ డైరెక్టర్‌ తెలిపారు. భారత్‌లో పోలియో కేసులు పూర్తిగా లేకుండా పోయినా.. పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌ వంటి పొరుగు దేశాల్లో పోలియో కేసులు ఇంకా నమోదవుతుండటంతో అక్కడి నుంచి వైరస్‌ వ్యాప్తి చెందకుండా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టారు. వలసలు ఎక్కువగా ఉండే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌–మల్కాజిగిరి, సంగారెడ్డి, హనుమకొండ, వరంగల్‌ జిల్లాలను ఈ కార్యక్రమం కోసం ఎంపిక చేశారు.  

తొలిరోజే అనూహ్య స్పందన.. 
రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 6,897 పోలియో బూత్‌లలో 15,91,907 మందికి, బస్‌ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు వంటి 138 రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ట్రాన్సిట్‌ పాయింట్లలో 22,173 మందికి టీకాలు వేశారు. 259 మొబైల్‌ టీంల ద్వారా మరో 21,352 మంది చిన్నారులకు పోలియో చుక్కలు అందించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 27,588 మంది వ్యాక్సినేటర్లు, 459 మంది సూపర్‌వైజర్లు పాల్గొన్నారు. పలు జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, మేయర్లు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. 

మిగిలిన చిన్నారులే లక్ష్యంగా ఇంటింటికీ...  
తొలిరోజు బూత్‌లకు రాలేకపోయిన చిన్నారులకు టీకా అందించేందుకు ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. సోమ, మంగళవారాల్లో వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు ఇంటింటికీ తిరిగి మిగిలిపోయిన పిల్లలను గుర్తించి పోలియో చుక్కలు వేస్తారు. ముఖ్యంగా వలస కార్మికులు, ఇటుక బట్టీలు, నిర్మాణ ప్రాంతాల్లో నివసించే వారి పిల్లలు ఎవరూ మిస్‌ కాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. అవసరమైతే హైదరాబాద్‌ వంటి నగరాల్లో 15వ తేదీన కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామన్నారు. ప్రతి చిన్నారికీ పోలియో చుక్కలు అందించి, పోలియో రహిత తెలంగాణ లక్ష్యాన్ని కాపాడాలని అధికారులు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement