ప్రభుత్వ ఆసుపత్రుల్లో 4.83 కోట్ల ఓపీ 

4. 83 Crore OPs In TS Government Hospitals - Sakshi

గతేడాదితో పోలిస్తే భారీగా పెరిగిన రోగులు 

ఆయా ఆసుపత్రుల్లో ఇన్‌పేషెంట్లు 16.97 లక్షలు 

వైద్య, ఆరోగ్యశాఖ వార్షిక నివేదిక–2022 వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవుట్‌ పేషెంట్ల (ఓపీ) సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆసుపత్రుల్లో సౌకర్యాలు పెరగడంతో రోగులు ప్రైవేటు ఆసుపత్రులకు బదులు ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తున్నారని వైద్య, ఆరోగ్యశాఖ వార్షిక నివేదిక–2022 తెలిపింది. 2021లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ 4.23 కోట్లుగా నమోదవగా 2022లో అది 4.83 కోట్లకు పెరిగిందని వెల్లడించింది. అలాగే 2021లో ఇన్‌–పేషెంట్‌ (ఐపీ) సేవలు 14.16 లక్షలుగా ఉండగా 2022లో అవి 16.97 లక్షలకు పెరిగాయని పేర్కొంది. 2021లో 2.57 లక్షలు జరగ్గా 2022 నాటికి సర్జరీల సంఖ్య 3.04 లక్షలకు పెరిగిందని తెలిపింది. 

నివేదికలోని ముఖ్యాంశాలు... 
►2022లో ఒకేసారి 8 వైద్య కాలేజీల ప్రారంభం. ఈ ఏడాది మరో 9 కాలేజీలు ప్రారంభించే పనులు. గతేడాది అదనంగా 200 పీజీ సీట్లు. 
►ఎంబీబీఎస్‌ సీట్లలో లక్ష జనాభాకు 19 సీట్లతో దేశంలో మొదటి స్థానం... లక్ష జనాభాకు ఏడు పీజీ మెడికల్‌ సీట్లతో దేశంలో రెండో స్థానం.  
►మాతృత్వ మరణాల రేటు 56 నుంచి 43కు (జాతీయ సగటు 97) తగ్గుదల. 
►శిశుమరణాల రేటు జాతీయ స్థాయిలో 28 ఉండగా రాష్ట్రంలో 21. 
►సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో 8,200 పడకలు అందుబాటులోకి తెచ్చేలా పనులు ప్రారంభం. 
►గతేడాది 515 డయాలసిస్‌ పరికరాలతో 61 కొత్త డయాలసిస్‌ కేంద్రాలు మంజూరు. గతేడాది 50 లక్షలు దాటిన డయాలసిస్‌ సెషన్స్‌ సంఖ్య. 
►కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్స్‌ మొదటి దశలో భాగంగా 9 జిల్లాల్లో పంపిణీ ప్రారంభం. 
►కంటివెలుగు రెండో దశ ప్రారంభం.  
►ప్రభుత్వ ఆసుపత్రుల్లో 33 శాతంగా ఉన్న ప్రసవాల రేటు ఇప్పుడు 61 శాతానికి పెరుగుదల.  
►గతేడాది జరిగిన 5.40 లక్షల ప్రసవాల్లో 61 శాతం అంటే 3.27 లక్షల ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే నిర్వహణ. 
►ఇన్ఫెక్షన్ల నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు. 
►రోగాలను ముందే గుర్తించి చికిత్స అందించేందుకు వీలుగా రాష్ట్రంలో ఎన్‌సీడీ స్క్రీనింగ్‌ కార్యక్రమానికి శ్రీకారం. గతేడాది చివరి నాటికి 1.48 కోట్ల మందికి స్క్రీనింగ్‌ నిర్వహణ. బీపీ, షుగర్‌ రోగులకు కిట్లు అందజేత. 
►కరోనా బూస్టర్‌ డోసు పంపిణీ 47 శాతం (జాతీయ సగటు 23 శాతం) పూర్తి.  
►ఇప్పటివరకు 11 వేల కొత్త పడకలు అందుబాటులోకి వచ్చాయి. 27,500 పడకలకు ఆక్సిజన్‌ సరఫరాకు ఏర్పాటు. 
►డైట్‌ చార్జీలు రూ. 40 నుంచి రూ. 80కి పెంపు. 
►రోగి సహాయకుల కోసం 18 పెద్దాసుపత్రుల్లో రూ. 5కే భోజన పథకం ప్రారంభం.  

మరిన్ని వార్తలు :

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top