అడవి చింత.. చారెడంత! | Sakshi
Sakshi News home page

అడవి చింత.. చారెడంత!

Published Fri, Jul 7 2023 3:04 AM

Tribal people of Chhattisgarh selling desi Tamarind in Karimnagar - Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: అరే.. చింతగింజలు ఏమిటి ఇంత భారీ సైజులో కనిపిస్తున్నాయని ఆశ్చర్యపోతున్నారా.. కానీ ఇవి చింతగింజలు కాదు.. అచ్చం వాటిని పోలినట్లు ఉండే అడవిచింత గింజలు! మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లోని అడవుల్లో పెరిగే ఓ భారీ తీగ జాతి మొక్క నుంచి వీటిని సేకరిస్తారు.

ఈ మొక్క కాండం చాలా పొడవుగా ఉంటుంది. దీని కాయలు సుమారు 4–5 అడుగుల వరకు పెరుగుతాయి. అచ్చం చింతకాయలను పోలి ఉండటంతో వీటిని ఆయా రాష్ట్రాల సరిహద్దులో ఉండే తెలుగువారు అడవిచింత గింజలుగా పిలుస్తున్నారు. ఈ గింజలను కరీంనగర్‌లోని పలు కూడళ్ల వద్ద ఛత్తీస్‌గఢ్‌కు చెందిన గిరిజనులు ఒక్కోటి సుమారు రూ. 30 వరకు విక్రయిస్తున్నారు.

ఈ గింజల్లో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని... పచ్చకామెర్లు, పంటినొప్పి, కీళ్ల నొప్పులను తగ్గించే గుణం వీటికి ఉందని చెబుతున్నారు. ఈ చింతగింజల నుంచి తీసిన నూనెను ఏదైనా గానుగ నూనెతో కలిపి కీళ్లనొప్పులకు మర్దన చేస్తే నొప్పులు తగ్గుతాయని అంటున్నారు. 

దట్టమైన అడవిలోనే పెరుగుతాయి 
ఈ అడవిచింత సీసాల్పనేసి కుటుంబపు మొక్క. దీని శాస్త్రీయ నామం ఎంటాడా పరిసేత. అధిక వర్షపాతంగల దట్టమైన అడవుల్లో పెరిగే ఔషధ మొక్క. ఈ తీగజాతి నుంచి గుత్తులు గుత్తులుగా చింతపండు ఆకారంలో వచ్చే పొడవైన కాయల నుంచి గింజలను గిరిజనులు సేకరిస్తారు.

తెలంగాణలో ఇలాంటి తీగజాతులు ఎక్కడాలేవు. ఏపీలోని తలకోన, శేషాచలం అడవులు, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాలు వాటికి అనుకూలం.  – డాక్టర్‌ నరసింహమూర్తి, శాతవాహన యూనివర్సిటీ 

Advertisement
 
Advertisement