సీఎం విజయ్‌ సుడిగాలి పర్యటన | - | Sakshi
Sakshi News home page

సీఎం విజయ్‌ సుడిగాలి పర్యటన

Oct 8 2026 3:36 AM | Updated on Oct 8 2026 4:06 PM

పోలీసు అకాడమీలో పతకాల ప్రదానం

ఆవిన్‌లో ఆకస్మిక తనిఖీ 

మాధవరంలో సీఎం విజయ్‌ పర్యటన

పెరంబూరు కార్యాలయంలో వినతుల స్వీకరణ

భద్రతా విధుల్లో ఏ మాత్రం తగ్గొద్దని, ప్రజలకు నిరంతరం అత్యుత్తమ సేవలు అందించాలని శిక్షణ ముగించుకున్న పోలీసు అధికారులకు సీఎం విజయ్‌ పిలుపు నిచ్చారు. ఉనమాంచ్చేరిలోని పోలీసు అకాడమీలో జరిగిన పతకాల ప్రదానంకు సీఎం విజయ్‌ హాజరయ్యారు. 

సాక్షి, చైన్నె : సీఎం విజయ్‌ బుధవారం సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా ఆవిన్‌ పాల ఉత్పత్తి పరిశ్రమలో ఆకస్మికంగా తనిఖీలు చేశారు. మాధవరంలో పర్యటించిన ఆయన తమిళనాడు సహకార పాల ఉత్పత్తిదారుల సంస్థ ఆవిన్‌ ఆధ్వర్యంలో రూ.2.23 కోట్ల వ్యయంతో కొత్తగా నిర్మించిన స్టేట్‌ సెంట్రల్‌ ల్యాబొరేటరీ అదనపు భవనాన్ని ప్రారంభించారు. అనంతరం మాధవరం డెయిరీ కార్యకలాపాలను పరిశీలించడంతో పాటు, అక్కడ జరుగుతున్న కొత్త పాలఉత్పత్తి ప్లాంట్‌ నిర్మాణ పనులను ఆయన తనిఖీ చేశారు. ఇక్కడ బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నిబంధనల ప్రకారం తాగునీటి పరీక్షలు , తమిళనాడు కాలుష్య నియంత్రణ బోర్డు మార్గదర్శకాల ప్రకారం మురుగునీటి పరీక్షలను అత్యంత కచ్చితత్వంతో నిర్వహించేందుకు ఈ అత్యాధునిక ల్యాబ్‌ ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆవిన్‌, జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల నాణ్యతా పరీక్షలను ఇది వేగంగా నిర్వర్తించనుంది.

మాధవరం డెయిరీ నేపథ్యం..

ఈ సందర్భంగా సీఎం విజయ్‌ పేర్కొన్నట్టుగా సమాచార శాఖ విడుదల చేసినప్రకటనలో 1963లో ప్రభుత్వం, యూనిసెఫ్‌ సంయుక్త సహకారంతో రోజుకు 50,000 లీటర్ల సామర్థ్యంతో ఈ ఉత్పత్తి కేంధ్రం ప్రారంభమైందని గుర్తుచేశారు. కాలక్రమేణా మౌలిక వసతులు మెరుగుపరచబడి, ప్రస్తుతం రోజుకు దాదాపు 4.50 లక్షల లీటర్ల పాలను పద్ధతిగా ప్రాసెస్‌ చేసే స్థాయికి చేరుకుందని వివరించారు.ప్రస్తుతం సగటున 120 వాహనాల ద్వారా ఉత్తర చైన్నె ప్రాంత ప్రజలకు నిరంతరం పాల పంపిణీ సజావుగా సాగుతోంది. ఈ పంపిణీ ప్రక్రియను తాను స్వయంగా పరిశీలించినట్టు గుర్తు చేశారు.

పెరంబూరు కార్యాలయంలో..

పెరంబూరులోని తన ఎమ్మెల్యే కార్యాలయానికి సీఎం విజయ్‌ ఉదయం వెళ్లారు.అక్కడ ఆయన ప్రజల నుంచి స్వయంగా విజ్ఞప్తులను స్వీకరంచారు. వాటిని పరిశీలించి తక్షణమే పరిష్కరించే విధంగా అధికారులను ఆదేశించారు. అలాగే,నియోజకవర్గంలో ఉన్న సమస్యలను గురించి కార్యాలయ సిబ్బందిని అడిగి తె లుసుకుని, త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.

పోలీసుల శిక్షణలో నవశకం
చెంగల్పట్టు జిల్లా ఊనమాంచ్చేరిలోని తమిళనాడు పోలీస్‌ ఉన్నత శిక్షణ సంస్థ వేదికగా జరిగిన డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ అధికారుల 14వ విడత శిక్షణ ముగింపు పరేడ్‌ సాయంత్రం జరిగింది. ఇందులో సీఎం విజయ్‌ పాల్గొన్నారు. తొలి సారిగా అకాడమికి వచ్చిన ఆయనకు అధికారుల గౌరవ వందనాన్ని సమర్పించారు.. ఈ విడతలో 11 మంది మహిళా అధికారులు, 14 మంది పురుష అధికారులు సహా మొత్తం 25 మంది డీఎస్పీ అభ్యర్థులు ఒక సంవత్సరం పాటు (52 వారాలు) అత్యంత కఠినమైన ప్రాథమిక శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. కేవలం చట్టాలు, పరిపాలనాంశాలే కాకుండా.. సైబర్‌ నేరాల కట్టడి, సాంకేతికత, ఆధునిక డిజిటల్‌ నేర పరిశోధన పద్ధతుల్లో వీరికి ప్రత్యేక శిక్షణనిచ్చారు. అలాగే, ఎస్టీఎఫ్‌ ఆధ్వర్యంలో 10 రోజుల అటవీ మనుగడ శిక్షణ, ట్రెక్కింగ్‌, ఈత, ఆయుధాల నిర్వహణ, మార్షల్‌ ఆర్ట్స్‌ వంటి అంశాలలోనూ అభ్యర్థులు రాణించారు. 

అత్యుత్తమ ప్రతిభను కనబరిచి అత్యున్నత పురస్కారమైన గౌరవ ఖడ్గంను డి. ఆనీష్‌ ప్రదీప్‌ సీఎం విజయ్‌ నుంచి అందుకున్నారు. రజత పతకాన్ని కార్తిక, కాంస్య పతకాన్ని పి.ఎస్‌. దివ్య అందుకున్నారు. ‘‘బాధ్యతాయుతమైన ప్రమాణం.. కనిపించే భయాలకు, పక్షపాతాలకు తావులేకుండా.. చట్టం ముందు అందరూ సమానమేనన్న భావనతో, ప్రజలందరికీ నిష్పక్షపాతంగా న్యాయం అందిస్తామని’’ కొత్త డీఎస్పీలు ఈసందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్‌ జె.సి.టి. ప్రభాకర్‌, పలువురు రాష్ట్ర కేబినెట్‌ మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సాయికుమార్‌, డిజిపి మహేష్‌ కుమార్‌ అగర్వాల్‌ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈసందర్భంగా సీఎం విజయ్‌ పోలీసు అధికారులకు , శిక్షణ ముగించిన వారికి భరోసా ఇచ్చే విధంగా వ్యాఖ్యలు చేశారు. విధి నిర్వహణలో తగ్గ వద్దు అని, తప్పు చేసిన వారెంతటి వారైనా సరే ఉపేక్షంచ వద్దు అని ఆదేశించారు.

రూ.152.26 కోట్లతో కొత్త కేంద్రం నిర్మాణం

చైన్నె నగర ప్రజల భవిష్యత్తు పాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, మాధవరంలో రోజుకు 7 లక్షల లీటర్ల పాలను నిర్వహించే సామర్థ్యంతో రూ.152.26 కోట్ల వ్యయంతో సరికొత్త ఆటోమేటిక్‌ టెక్నాలజీతో కూడిన భారీ పాల ప్లాంట్‌ నిర్మాణం వేగంగా జరుగుతోందని గుర్తుచేశారు. ఈ నిర్మాణ పనులను పరిశీలించిన , పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించానని పేర్కొన్నారు. అదే సమయంలో సీఎం విజయ్‌ను అక్కడిపాల ఉత్పత్తి దారులు, పరిశ్రమలలోపనిచేసే కార్మికులు కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఇక్కడి నుంచి బయటకు వస్తున్న సమయంలో ప్రధాన గేట్‌ వద్ద ఓ సెక్యూరిటీ సిబ్బంది సీఎం విజయ్‌తో సెల్పీదిగడం విశేషం. ఈ కార్యక్రమంలో పాల, డెయిరీ అభివృద్ధి శాఖ మంత్రి సి. విజయలక్ష్మి, శాసనసభ్యులు ఎం.ఎల్‌. విజయ్‌ ప్రభు, ఎన్‌. సెంథిల్‌ కుమార్‌, తమిళనాడు హౌసింగ్‌ బోర్డ్‌ చైర్మన్‌ వి. శివ, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement