అస్సాం ఏనుగుల తరలింపుపై వివాదం | - | Sakshi
Sakshi News home page

అస్సాం ఏనుగుల తరలింపుపై వివాదం

Oct 8 2026 3:30 AM | Updated on Oct 8 2026 3:30 AM

● గిఫ్టా లేక కొనుగోలా? ● ప్రభుత్వానికి 53 సంస్థల సంయుక్త లేఖ

సాక్షి, చైన్నె: అస్సాం రాష్ట్రం నుండి తమిళనాడులోని దేవాలయాలకు ఇటీవల తరలించిన ఐదు చిన్న ఏనుగుల (దుర్గ, రుప్‌సింగ్‌, శివ, హిరలాల్‌, బిజులి) కొనుగోలు , బదిలీపై తీవ్రమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇవి నిజంగా బహుమతులా లేక కొనుగోలు చేసినవా అనే అంశంపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ 53 జంతు సంక్షేమ, వన్యప్రాణి పరిరక్షణ సంస్థలు తమిళనాడు ప్రభుత్వానికి సంయుక్తంగా లేఖ సమర్పించాయి. ఈ వివరాలను బుధవారం ఒక ప్రకటన రూపంలో విడుదల చేశారు.

బహుమతా లేక రహస్య కొనుగోలా?:

ఏనుగుల బదిలీని కొందరు బహుమతిగా, మరికొందరు విరాళంగా లేదా కొనుగోలుగా పేర్కొంటున్నారని, దీనిపై అసలు వాస్తవాలు ఏమిటో వెల్లడించాలని ఆ లేఖలో కోరారు. ఏనుగుల యాజమాన్య హక్కులు ఎలా మారాయి, డబ్బులు ఏమైనా చేతులు మారాయా అనే దానిపై స్పష్టత కోరుతున్నారు. ఈ ఏనుగుల పుట్టిన తేదీలకు చాలా కాలం తర్వాత, అక్టోబర్‌–నవంబర్‌ 2025లో మాత్రమే యాజమాన్య ధ్రవీకరణ పత్రాలు జారీ చేయబడ్డాయని, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పునరుద్ధరించాల్సిన రుప్‌సింగ్‌ ధ్రువీకరణ పత్రంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. అస్సాం నుండి తమిళనాడుకు సుమారు 3,000 కిలోమీటర్ల దూరం కేవలం 9 రోజుల్లోనే ఏనుగులను రవాణా చేశారని, ఈ ప్రయాణంలో ఏనుగులను గొలుసులతో కట్టేయడం, చెవుల ద్వారా తాడులు దూర్చి లాగడం వంటి చిత్రహింసలకు గురిచేసినట్లు ఫొటోలు, వీడియోల ద్వారా ఆరోపించారు. తమిళనాడు క్యాప్టివ్‌ ఎలిఫెంట్స్‌ రూల్స్‌, 2011 ప్రకారం.. 6 అడుగుల కంటే తక్కువ ఎత్తు ఉన్న ఏనుగులను పనులకు, ఊరేగింపులకు ఉపయోగించకూడదని, అయితే,ఈ ఏనుగులు ఆ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని, వాటికి పెర్ఫార్మింగ్‌ యానిమల్‌ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌ కూడా లేదని సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అస్సాం నుండి మరో ఆరు చిన్న ఏనుగులను త్వరలో తమిళనాడుకు తరలించే సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో, ఈ ఐదు ఏనుగుల అంశంపై పూర్తి విచారణ జరిపే వరకు తదుపరి తరలింపులను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ఐదు ఏనుగుల కొనుగోలు, యాజమాన్య చరిత్రపై సమగ్ర విచారణ జరపాలని, అటవీ, పోలీస్‌, వన్యప్రాణి నిపుణులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందం లేదా హై–లెవెల్‌ ఫ్యాక్ట్‌–ఫైండింగ్‌ కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. ఏనుగుల వయసు, ఎత్తుపై స్వతంత్య్ర పశువైద్య పరీక్షలు నిర్వహించాలని, విచారణ పూర్తయ్యే వరకు ఏనుగులను ఎలాంటి ఆచారాలు, ఊరేగింపులు లేదా పనులకు వినియోగించకూడదని సూచించారు. అస్సాం నుండి మరిన్ని ఏనుగుల తరలింపును తాత్కాలికంగా నిలిపివేయాలంటూ ఈ సంయుక్త విజ్ఞాపన పత్రంలో పీపుల్‌ ఫర్‌ కేటిల్‌ ఇన్‌ ఇండియా అధ్యక్షుడు అరుణ్‌ ప్రసన్న తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 53 ప్రముఖ జంతు సంక్షేమ సంస్థలు సంతకాలు చేసి ఉండడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement