సాక్షి, చైన్నె : తమిళనాడులోని మధురాంతకం, ధారాపురం, పుదుచ్చేరి తట్టాన్ చావడి నియోజకవర్గాలలో పోలైన ఓట్లతో ఊడిన ఈవీఎంలు అన్నీ స్ట్రాంగ్ రూములకు బుధవారం ఉదయాన్నే పూర్తి స్తాయిలో చేరాయి. ఇక్కడ ఐదు అంచెల భద్రత కల్పించారు. శుక్రవారం ఓట్ల లెక్కింపునకు సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయి. వివరాలు.. మధురాంతకం నియోజకవర్గంలో మరగతం కుమారవేల్ (టీవీకే), పరంధామన్ (డీఎంకే), కణిత సంపత్ (అన్నాడీఎంకే ), సుగంది( సీపీఎం), జానకిరామన్ (నామ్ తమిళర్ కట్చి) తదితరులు పోటీపడ్డారు. ఇక, ధారాపురంలో సత్యభామ (టీవీకే), సుకన్య (డీఎంకే), భానుమతి(అన్నాడీఎంకే), లక్ష్మణన్ (సీపీఎం)తదితరులతో పాటు మరికొందరు పోటీ చేశారు. ఈ రెండు నియోజకవర్గాల్లో మంగళవారం ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. కొత్త ఓటర్లు సైతం పెద్దఎత్తున పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధురాంతకంలో మొత్తం 2,13,788 మంది ఓటర్లకు గాను 1,84,423 మంది ఓటు వేశారు.గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ శాతంలో స్వల్ప తగ్గుదల నమోదైంది.ధారాపురంలోనూ అదే పరిస్థితి. ఓటింగ్ శాతం తగ్గిన నేపథ్యంలో ఎవరికి అనుకూలం అన్న ఉత్కంఠ అభ్యర్థులలో నెలకొన్నాయి. తట్టాంచావడి పరిస్థితి కూడా అంతే. ఈ నియోజకవర్గాలలో ఉపయోగించిన ఈవీఎంలను ఆయా నియోజకవర్గాల పరిధిలోని ప్రభుత్వం కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములకు తరలించారు. మారు మూల గ్రామాల నుంచిఈవీఎంలు బుధవారం వేకువ జాము వరకు స్ట్రాంగ్ రూములకు వచ్చి చేరాయి. వీటన్నింటిని సరి చూసిన ఎన్నికల అధికారులు స్ట్రాంగ్ రూములకు సీల్ వేశారు.
ఏజెంట్ల సమక్షంలో సీల్..
పోలింగ్ ముగిసిన తర్వాత రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలను పకడ్బందీగా సీల్ చేశారు. సాయుధ పోలీసుల రక్షణలో ఈవీఎంలను చెంగల్పట్టు జిల్లా అత్తూరులోని సాంఘిక అభివృద్ధి శిక్షణా కేంద్రానికి తరలించారు. ధారాపురంలో ఓటింగ్ యంత్రాలను ఎల్‌ఆర్‌జీ ప్రభుత్వ మహిళా ఆర్ట్స్ కళాశాలలోని స్ట్రాంగ్ రూములకు చేరగా, జిల్లా కలెక్టర్ స్వయంగా తనిఖీ చేశారు. స్ట్రాంగ్ రూమ్‌లు, కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 3 నుండి 5 అంచెల పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. కేంద్ర పారామిలిటరీ బలగాలు, సాయుధ దళాలు నిరంతరం విధులలో ఉన్నాయి. మొత్తం 64 సీసీటీవీ కెమెరాలు, 5 నిఘా టవర్ల ద్వారా ప్రతి కదలికను పరిశీలిస్తున్నారు. అలాగే బాంబు స్క్వాడ్, అగ్నిమాపక సిబ్బందిని కూడా సిద్ధంగా ఉంచారు. 9వ తేదీ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ లెక్కింపు సీసీటీవీ కెమెరాల నిఘా పర్యవేక్షణలో కొనసాగనుంది. ఇందుకు సంబంఽధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.


