పద్దుల చిట్టా సమర్పించండి | - | Sakshi
Sakshi News home page

పద్దుల చిట్టా సమర్పించండి

Oct 8 2026 3:36 AM | Updated on Oct 8 2026 3:36 AM

– పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు

సాక్షి, చైన్నె: తొమ్మిది జిల్లాలకు చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు పదవీ కాలం మరో వారంలో ముగియనున్న నేపథ్యంలో బడ్జెట్‌ ఆదాయ వ్యయాలకు సంబంధించిన పూర్తి ఖాతాలను కేంద్ర కార్యాలయానికి సమర్పించాలని పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. చెంగల్పట్టు, కాంచీపురం సహా 9 జిల్లాల స్థానిక సంస్థల అధ్యక్షులు , సభ్యుల పదవీ కాలం ముగియనున్నది. ఇప్పట్లో ఎన్నికల నిర్వహణ అసాధ్యం కావడంతో ప్రత్యేక అధికారుల నియామక కసరత్తులు జరుగుతున్నాయి. దీంతో ఈ నెల 16వ తేదీ నాటికి లెక్కలన్నీ పూర్తి చేయాలని జిల్లా కార్యదర్శులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెళ్లాయి.

ప్రత్యేక అధికారుల నియామకం

స్థానిక నిర్వాహకుల పదవీకాలం ముగియనుండటం, వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో.. భవన నిర్మాణ అనుమతులు, లేఅవుట్‌ అనుమతులు, వర్షాకాల సమస్యలను పర్యవేక్షించేందు కు ప్రత్యేక అధికారులను నియమించనున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎలాంటి కొత్త ప్రాజెక్టులను ప్రారంభించవద్దని మౌఖిక ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. ఆయుధ పూజ, విజయదశమి సెలవులను దృష్టిలో ఉంచుకుని, పంచాయతీల అన్ని ఆదాయ వ్యయాల లెక్కలను 16వ తేదీలోగా కేంద్ర కార్యాలయానికి కచ్చితంగా సమర్పించాలని గ్రామ కార్యదర్శులను ఆదేశించారు. అలాగే, నిర్వాహకులు లేని సమయంలో ఎలాంటి కొత్త కొనుగోళ్లు చేపట్టవద్దని కఠిన నిబంధనలు పెట్టారు.

త్వరలో.. అన్నయ్యసారె!

– పథకం అమలుకు కసరత్తు

– బంగారు నాణేలు, పట్టు చీరల పంపిణీ

సాక్షి,చైన్నె: తమిళనాడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన అన్నన్‌ సీర్‌(అన్నయ్య సారె) పథకం అమలుకు సంబంధించి సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం. పల్లవి బల్దేవ్‌ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పథకానికి అవసరమైన ఆర్థిక అనుమతులు మంజూరు చేస్తూ షరతులను ప్రకటించారు.

పథకం ఉద్దేశం..

తమిళనాడులో వివాహం చేసుకోబోయే వధువులకు ప్రభుత్వ కానుకగా 8 గ్రాముల (22 క్యారెట్ల) బంగారు నాణెం , పట్టు చీరను అందించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. కుటుంబ వార్షిక ఆదాయం రూ. 2.5 లక్షల వరకు ఉన్న వధువులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ప్రభుత్వ ఉత్తర్వు వెలువడిన తేదీ నుండి జరిగే వివాహాలకు ఈ పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు. సామాజిక సంక్షేమ శాఖ డైరెక్టర్‌ విజ్ఞప్తి మేరకు, తొలి విడతగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 812 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించింది. అర్హులు దరఖాస్తు చేసుకోవడానికి త్వరలోనే ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించనున్నారు. కాగా, ఎన్నికల సమయంలో కుటుంబ వార్షిక ఆదాయ పరిమితిని రూ. 5 లక్షల వరకు ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ప్రస్తుతం అమలు చేసేటప్పుడు ఆ ఆదాయ పరిమితిని రూ. 2.5 లక్షలకు తగ్గించడం రాజకీయంగా , ప్రజావర్గాలలో చర్చకు దారితీసింది. కాగా, గతంలో అన్నాడీఎంకే హయంలో తాళికి బంగారం పేరిట పథకాన్ని అమలు చేస్తూ వచ్చారు. దీనిని డీఎంకే సర్కారు తుంగలో తొక్కగా, తాజాగా మెరుగులు దిద్ది అన్నయ్య సారెగా అమలుకు సీఎం విజయ్‌ టీవీకే సర్కారు సన్నద్దం కావడం విశేషం.

చైన్నెలో బైక్‌ రేసుల కట్టడికి 15 ప్రత్యేక బృందాలు

– ట్రాఫిక్‌ పోలీసుల నిఘా తీవ్రం

సాక్షి, చైన్నె: నగరంలో బైక్‌ రేసులను అడ్డుకోవడానికి పోలీసులు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయగా, ఆ సిబ్బంది మఫ్టీలో ఉంటూ ముమ్మర నిఘా కొనసాగిస్తున్నారు. చైన్నెలోని అన్నాసాలై, ఈస్ట్‌ కోస్ట్‌ రోడ్‌, కామరాజర్‌ సాలై తదితర ప్రధాన రోడ్లలో యువకులు బైక్‌ రేసులు , ప్రమాదకర స్టంట్లు చేయడాన్ని నిరోధించడానికి ట్రాఫిక్‌ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా శుక్రవారం, శనివారం రాత్రి సమయాల్లో యువకులు అత్యంత వేగంగా బైక్‌లను నడపడం, వీలింగ్‌ వంటి సాహసాలకు పాల్పడడం జరుగుతోంది.గత వారం సర్ధార్‌ పటేల్‌ రోడ్డు ప్రాంతంలో కొందరు యువకులు అత్యంత వేగంగా బైక్‌లు నడుపుతూ ప్రమాదకర స్టంట్లకు పాల్పడ్డారు. దీనిపై స్పందించిన ట్రాఫిక్‌ ఇన్వెస్టిగేషన్‌ వింగ్‌ పోలీసులు 16 మందిని అరెస్ట్‌ చేసి, వారి వద్ద నుంచి 11 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా, బైక్‌ రేసులు , స్టంట్లలో పాల్గొని పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా, అలాగే ప్రభుత్వ ఆస్తులకు నష్టం చేకూర్చేలా విన్యాసాలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని చైన్నె ట్రాఫిక్‌ పోలీస్‌ అడిషనల్‌ కమిషనర్‌ చాముండేశ్వరి తీవ్రంగా హెచ్చరించారు. బైక్‌ రేసుల్లో పాల్గొనేవారిని అరెస్ట్‌ చేయడంతో పాటు వారి బైక్‌లను సీజ్‌ చేయడానికి చైన్నెవ్యాప్తంగా 15 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, సాదా దుస్తుల్లో నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement