దేశ ప్రతిష్టను దిగజార్చారు.. | - | Sakshi
Sakshi News home page

దేశ ప్రతిష్టను దిగజార్చారు..

Jun 25 2026 1:42 AM | Updated on Jun 25 2026 1:42 AM

– కేంద్రంపై మంత్రి రాజేష్‌ కుమార్‌ ఫైర్‌

సాక్షి, చైన్నె: కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల అంతర్జాతీయంగా భారతదేశానికి ఉన్న మంచి పేరు తీవ్రంగా దెబ్బతిన్నాయని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రాజేష్‌ కుమార్‌ తీవ్రంగా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ ఆయన బుధవారం స్థానికంగా మాట్లాడారు.

విభజన రాజకీయాలు

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో మైనారిటీ ల హక్కులను కాలరాస్తూ, సమాజంలో విభజన రేఖలను సృష్టిస్తున్నదని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యానికి, మతసామరస్యానికి పట్టుగొమ్మ అయిన భారతదేశ కీర్తి ప్రతిష్టలను తమ స్వార్థ రాజకీయాల కోసం బీజేపీ ప్రభుత్వం ప్రపంచ దేశాల ముందు పణంగా పెట్టిందని మండిపడ్డారు.

మైనారిటీల రక్షణలో విఫలం

కేంద్ర మైనారిటీ సంక్షేమ శాఖ కేవలం కాగితాలకే పరిమితమైందన్నారు. దేశంలోని మైనారిటీ వర్గాల హక్కులను, వారి భద్రతను కాపాడటంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజాస్వామ్య విలువలను పక్కనబెట్టి నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. కేంద్ర ప్రభుత్వం కేవలం కొన్ని వర్గాల ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నదన్నారు., దేశ ఆర్థిక, సామాజిక వృద్ధిని పక్కనబెట్టి మతపరమైన అంశాలపైనే ఎక్కువ శ్రద్ధ చూపుతోందని ధ్వజమెత్తారు.

సొఫా మోడల్‌ ప్రభుత్వానికి

రోజులు దగ్గర పడ్డాయ్‌.. !

– ఉదయనిధి స్టాలిన్‌

సాక్షి, చైన్నె: తమిళనాడులో అధికార పీఠంపై ఉన్న తమిళగ వెట్రి కళగం ప్రభుత్వంపై ప్రతిపక్ష నాయకుడు, డీఎంకే యువజన నేత ఉదయనిధి స్టాలిన్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డీఎంకేకు చెందిన యువత ప్రభుత్వంపై గళమెత్తితే పోలీసులను ప్రయోగించడం, అదే సమయంలో వారిపై దాడులు చేస్తున్న టీవీకే శ్రేణులపై చర్యలు తీసుకోకపోవడంపై చూస్తుంటే.. ఇదేనా మీరు చెప్తున్న మార్పు? అని ధ్వజమెత్తారు. ఈ మేరకు బుధవారం ఉదయ నిధి స్టాలిన్‌ స్పందిస్తూ, డీఎంకేకు చెందిన యువతను ఏకం చేస్తూ సమావేశాలు నిర్వహిస్తున్న అన్బానందన్‌ అరియప్పన్‌ ఇంటికి, కృష్ణగిరి రాయకోట్టైలో అర్ధరాత్రి వేళ పోలీసులు అక్రమంగా చొరబడి అరెస్ట్‌ చేయడానికి ప్రయత్నించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. సైదాపేటలో కని అనే యువకుడిపై టీవీకే రౌడీలు సైదాపేటలో ఘోరంగా దాడి చేశారని ధ్వజమెత్తారు. దాడి చేసిన నిందితులపై ఇప్పటివరకు ఎలాంటి కేసు నమోదు చేయని పోలీసులు, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కనిని బెదిరించి మరీ డిశ్చార్జ్‌ చేయించడం అత్యంత దారుణంగా పేర్కొన్నారు. పాలనా సామర్థ్యం లేని ఈ సోఫా మోడల్‌ ప్రభుత్వ నకిలీ ముసుగు, యువతలో ముక్కలు ముక్కలుగా విరిగిపోతోందన్నారు. దీనిని తట్టుకోలేకే పాలకులు ఇలాంటి అణచివేత చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పోలీసులను అడ్డం పెట్టుకుని డీఎంకే యువతను భయపెట్టాలని చూస్తే తమ పార్టీ ఊరుకోదని హెచ్చరించారు. అధికార పార్టీ వారు దాడులు చేస్తే ప్రేక్షకపాత్ర పోషిస్తూ, ప్రశ్నించిన వారిపై ఖాకీలను ప్రయోగిస్తున్న ప్రస్తుత ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నామన్నారు.

నిబంధనల ఉల్లంఘన కాదు..!

– సీఎం విజయ్‌ సైగలపై స్పీకర్‌ స్పష్టీకరణ

సాక్షి, చైన్నె: శాసనసభ సమావేశాల్లో సీఎం విజయ్‌ చేసిన కొన్ని సైగలు సభా నిబంధనల ఉల్లంఘన పరిధిలొఓకి రావు అని స్పీకర్‌ జే.సీ.డీ. ప్రభాకర్‌ స్పష్టం చేశారు. ఈ విషయమై ప్రతిపక్షాలు లేవనెత్తిన అభ్యంతరాలను, హక్కుల ఉల్లంఘన నోటీసులను స్పీకర్‌ బుధవారం తిరస్కరించారు. వివరాలు.. సభ జరుగుతున్న సమయంలో మంగళవారం సీఎం విజయ్‌ అధికార పక్ష సభ్యులనుద్దేశించి లేదా ప్రతిపక్షాల విమర్శలపై స్పందిస్తూ కొన్ని చేతి సైగలు చేశారని, ఇది సభా మర్యాదలకు విరుద్ధమన్న విమర్శలుబయలు దేరాయి. దీనిపై స్పీకర్‌ జే.సీ.డీ. ప్రభాకర్‌ వివరణ ఇచ్చారు. సీఎం విజయ్‌ చేసిన సదరు సైగలు ఎవరినీ కించపరిచేలా లేవని, సభ సజావుగా సాగడానికి లేదా సాధారణ చర్చల సందర్భంలో జరిగినవేనని స్పీకర్‌ పేర్కొన్నారు. శాసనసభ రూల్స్‌ ప్రకారం దీనిని సభా హక్కుల ఉల్లంఘనగా పరిగణించలేమని, ఈనేపథ్యంలో ప్రతిపక్షాల ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని తేల్చి చెప్పారు. సీఎం విజయ్‌ ప్రవర్తనపై వచ్చిన ఫిర్యాదులను స్పీకర్‌ జేసీడీ. ప్రభాకర్‌ తోసిపుచ్చారు. సభను రాజకీయ కారణాలతో అడ్డుకోవద్దని, ప్రజా సమస్యలపై చర్చించేందుకు సహకరించాలని సభ్యులందరికి విజ్ఞప్తిచేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement