సర్కారీ కొలువుల పండుగ | - | Sakshi
Sakshi News home page

సర్కారీ కొలువుల పండుగ

Jun 25 2026 1:42 AM | Updated on Jun 25 2026 1:42 AM

విద్యుత్‌శాఖలో కొత్తగా 401 మంది నియామకం

ఉత్తర్వులను అందజేసిన సీఎం విజయ్‌

సాక్షి, చైన్నె : ప్రభుత్వంలోని విభాగాలలో ఖాళీలను గుర్తించి త్వరితగతిన భర్తీ దిశగా అధికారులను సీఎం విజయ్‌ ఆదేశించారు. ఈ ఏడాది 15 వేల పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టారు. విద్యుత్‌శాఖలో కొత్తగా ఎంపికై న 401 మందికి సీఎం విజయ్‌ బుధవారం నియామక ఉత్తర్వులను అందజేశారు. వివరాలు.. చైన్నెలోని కలైవానర్‌ అరంగంలో జరిగిన బుధవారం జరిగిన కార్యక్రమంలో సీఎం విజయ్‌ కొత్తగాఎంపికై న వారికి ఈ నియామక పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముందు ముఖ్యమంత్రి విజయ్‌ నేతృత్వంలో విద్యుత్‌ శాఖపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యుత్‌ బోర్డులో దాదాపు 70,000కు పైగా వివిధ రకాల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, విద్యుత్‌ సరఫరాలో తలెత్తుతున్న సమస్యలకు ఈ సిబ్బంది కొరత కూడా ఒక ప్రధాన కారణమని అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన సీఎం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ప్రజలకు అంతరాయం లేని నిరంతర విద్యుత్‌ సరఫరాను అందించడమే లక్ష్యంగా కీలక ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్‌ శాఖను బలోపేతం చేసేందుకు రాబోయే ఏడాది కాలంలో కనీసం 15,000 మంది సిబ్బందిని తక్షణమే నియమించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అందులో భాగంగానే ఇప్పుడు ఎంపికై న 401 మందికి వెంటనే నియామక ఉత్తర్వులు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. తమిళనాడు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా ఎంపికై న వీరిలో 383 మంది అసిస్టెంట్‌ ఇంజినీర్లు (ఎలక్ట్రికల్‌), 18 మంది అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్లు ఉన్నారు.

ఏడాదిలో 15 వేల పోస్టుల భర్తీకి ఆదేశం

పారదర్శక పాలనకు నిదర్శనం

తమిళనాడు ప్రభుత్వ పారదర్శక పాలనకు నిదర్శనంగా తాజాగా ఈ నియామకాలు జరిగాయని ప్రకటించారు. ఇది విద్యుత్‌ శాఖ పనితీరు, సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచడమే కాకుండా, తమిళనాడు ప్రజలకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్‌ సేవలను అందించేందుకు మానవ వనరులను బలోపేతం చేసే ఒక ముఖ్యమైన చర్యగా ప్రకటించారు. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో విద్యుత్‌, న్యాయశాఖ మంత్రి సి.టి.ఆర్‌. నిర్మల్‌ కుమార్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సాయికుమార్‌, విద్యుత్‌ బోర్డు చైర్మన్‌ డాక్టర్‌ జె. రాధాకృష్ణన్‌, విద్యుత్‌ శాఖ ప్రధాన కార్యదర్శి అనిల్‌ మేష్రామ్‌ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా, ఉద్యోగ నియామక ఉత్తర్వులు అందుకున్నవారందరి మధ్యలో కూర్చుని సీఎం విజయ్‌ ఫొటో తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం విజయ్‌ తనదైన స్టైల్లో అభివాదం చేయడం ఆసక్తికరంగా మారింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement