సాక్షి, చైన్నె: ప్రైవేట్ పాఠశాలలు తమ విద్యార్థుల ఫీజుల వివరాలను తప్పనిసరిగా నోటీస్ బోర్డులపై ప్రదర్శించాలంటూ రాష్ట్ర సమాచార కమిషన్ , ప్రైవేట్ పాఠశాలల డైరెక్టరేట్ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన కేసులో మద్రాస్ హైకోర్టు తన తీర్పును వాయిదా వేసింది. వివరాలు.. తమిళనాడు వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వం నిర్ణయించిన విద్యా ఫీజుల వివరాలను తమ స్కూల్ నోటీస్ బోర్డులపై స్పష్టంగా ప్రదర్శించడాన్ని తప్పనిసరి చేయాలని గత నెల 25న తమిళనాడు రాష్ట్ర సమాచార కమిషన్ ఆదేశించింది. ఈ ఆదేశాల ఆధారంగా.. జూన్ 5వ తేదీ లోపు రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ నర్సరీ, ప్రైమరీ, మెట్రిక్యులేషన్, సీబీఎస్‌ఈ , ఇతర బోర్డుల పాఠశాలలు ఫీజుల వివరాలను బోర్డులపై పెట్టాలని జూన్ 1న ప్రైవేట్ పాఠశాలల డైరెక్టర్ ఒక ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఈ రెండు ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఆల్ ఇండియా ప్రైవేట్ విద్యా సంస్థల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె. పళనియప్పన్ చైన్నె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు జస్టిస్ ఎం. దండపాణి ఎదుట విచారణకు వచ్చింది.
వాడీవేడి వాదనలు..
విచారణ సందర్భంగా ఇరుపక్షాల న్యాయవాదులు తమ వాదనలను బలంగా వినిపించారు. సమాచార హక్కు చట్టం ప్రైవేట్ విద్యా సంస్థలకు వర్తించదని సుప్రీంకోర్టు గతంలోనే తీర్పు ఇచ్చిందని పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. అలాగే సీబీఎస్‌ఈ వంటి కేంద్ర ప్రభుత్వ సిలబస్‌తో నడిచే పాఠశాలలను నియంత్రించే అధికారం తమిళనాడు ప్రభుత్వానికి లేదని వాదించారు. తమిళనాడు ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదిస్తూ, ప్రభుత్వ నిబంధనల ప్రకా రం పాఠశాలలు తమ ఫీజుల వివరాలను బహిరంగంగా వెల్లడించాల్సిందేనని ప్రభుత్వ తరఫు న్యాయవాది స్పష్టం చేశారు. ఒకవేళ ఈ ఉత్తర్వులపై అభ్యంతరాలు ఉంటే వ్యక్తిగతంగా ఆయా పాఠశాలలు కేసు వేయాలి కానీ, అసోసియేషన్ తరఫున ఇలాంటి పిటిషన్ వేయడానికి వీల్లేదని వాదనలు వినిపించారు. బుధవారం జరిగిన తుది విచారణలో తమిళనాడు ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ గౌతమ్, పిటిషనర్ తరఫున లాయర్ విజయ్ ఆనంద్ తమ వాదనలను పూర్తి చేశారు. ఇరుపక్షాల సుదీర్ఘ వాదనలను రికార్డు చేసుకున్న న్యాయమూర్తి జస్టిస్ ఎం. దండపాణి విచారణను ముగించారు. ఈ కేసు తీర్పును తేదీ ఖరారు చేయకుండా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.


