సాక్షి, చైన్నె: గత కొంతకాలంగా తీవ్ర రాజకీయ విభేదాలతో దూరంగా ఉంటున్న పీఎంకే వ్యవస్థాపకుడు డాక్టర్ రామదాస్, ఆ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ అన్బుమణి రామదాస్ బుధవారం ముఖాముఖి కలుసుకున్నారు. తండ్రీకొడుకుల మధ్య గత కొన్ని నెలలుగా నడుస్తున్న తీవ్ర ఘర్షణ వాతావరణం నేపథ్యంలో వీరిద్దరి తాజా భేటీ తమిళనాడు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆశ్చర్యాన్ని, ఆసక్తిని రేకెత్తించింది.
పెళ్లి రోజు వేడుకల్లో కలిసిన తండ్రీకొడుకులు
పీఎంకే వ్యవస్థాపకుడు డాక్టర్ రామదాస్ – సరస్వతి దంపతులకు బుధవారం 61వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని.. వారి కుమారుడు, పార్టీ అధ్యక్షుడు అన్బుమణి రామదాస్ తన కుటుంబ సభ్యులతో కలిసి దిండివనం సమీపంలోని తైలాపురంలోని నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా తలిదండ్రులకు ఆయన ప్రత్యేకంగా వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపి, వారి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు.
రాందాసు కన్నీటిపర్యంతం
తైలాపురం నివాసానికి వచ్చిన అన్బుమణిని చూడగానే డాక్టర్ రామదాస్ కన్నీటి పర్యంతమయ్యారు. భావోద్వేగానికి లోనైన ఆయన, కుమారుడిని గట్టిగా ఆలింగనం చేసుకుని లోపలికి ఆహ్వానించారు. కాగా గత డిసెంబర్ 2024లో జరిగిన పీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశంలో రామదాస్, అన్బుమణి మధ్య విభేదాలు బహిరంగంగా బద్దలయ్యాయి. ఆ తర్వాత ఇరువర్గాల మధ్య ఘర్షణ పెరిగి, ఒకరి మద్దతుదారులను మరొకరు పార్టీ పదవుల నుండి తొలగించుకునే వరకు వెళ్లింది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్బుమణి నేతృత్వంలోని పీఎంకే వర్గం అన్నాడీఎంకే కూటమిలో చేరి పోటీ చేసి 4 స్థానాల్లో విజయం సాధించింది. మరోవైపు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళతో కూటమి కట్టి ఎన్నికల్లో పోటీ చేసిన రామదాస్ వర్గం ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా తండ్రి, తనయుడి భేటీ పీఎంకేలో జోష్‌ను నింపినట్లయ్యింది.
అన్బుమణి రామదాస్ కీలక వ్యాఖ్యలు
ఈ భేటీ అనంతరం అన్బుమణి మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ రోజు అమ్మానాన్నల పెళ్లి రోజు సందర్భంగా, కుటుంబ సమేతంగా వెళ్లి వారి ఆశీస్సులు తీసుకున్నాం. ఇకపై అంతా మంచే జరుగుతుంది’ అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. ఏడాదిన్నర కాలంగా సాగుతున్న తండ్రీకొడుకుల పోరుకు ఈ భేటీతో ఎండ్ కార్డ్ పడినట్లేనని, పీఎంకే పార్టీ మళ్లీ ఒకే తాటిపైకి వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ శ్రేణులు , అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


