– టీవీకే శ్రేణులకు మంత్రి ఆనంద్ ఆదేశం
సాక్షి, చైన్నె: ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంతరాయం కలిగించవద్దని, రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన పార్టీ కటౌట్లు, బ్యానర్లను తక్షణమే తొలగించాలని టీవీకే వర్గాలకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి మంత్రి ఆనంద్ ఆదేశించారు. సీఎం విజయ్ ఆదేశం ఇది అని తక్షణం తొలగించాలని స్పష్టంచేశారు., టీవీకే అధినేత విజయ్ ఆదేశాల మేరకు ఆయన ఈ కీలక ప్రకటన విడుదల చేశారు. విజయ్ సీఎం పగ్గాలు చేపట్టినానంతరం టీవీకే వర్గాలు కాస్త దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. ఈనెల 22న సీఎం విజయ్ బర్తడే సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా బ్యానర్లు, కటౌట్లు హోరెత్తించి ఉన్నారు. ఇవి కాస్త ప్రజలకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. వాహనదారులకు తంటాలు తప్పడం లేదు. దీంతో ఆనంద్ స్పందిస్తూ, సీఎం విజయ్ ప్రజల సౌకర్యం, సంక్షేమం గురించే ఆలోచిస్తారని, వారికి ఇబ్బంది కలిగించే ఎలాంటి పనులనూ ఆయన సహించరని హెచ్చరించారు. రోడ్లపై పెద్ద ఎత్తున కటౌట్లు, బ్యానర్లు పెట్టకూడదని ఆయన ఇప్పటికే స్పష్టం చేసి ఉన్నారన్నారు. పార్టీ సర్వసభ్య సమావేశాల్లో బ్యానర్ సంస్కృతికి స్వస్తి పలకాలని వాలంటీర్లకు పదేపదే స్పష్టం చేయడం జరిగిందన్నారు. అయినప్పటికీ,భారీగా బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటు చేయడం మంచి పద్దతి కాదన్నారు. ప్రజల రాకపోకలకు ఆటంకం కలిగించేలా ఉన్న అన్ని రకాల కటౌట్లను, బ్యానర్లను నిర్వాహకులు స్వచ్ఛందంగా తక్షణమే తొలగించాలని, భవిష్యత్తులో టీవీకే ఇటువంటి సంస్కృతికి పూర్తిగా దూరంగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు.


