సాక్షి, చైన్నె: పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రజల ఫిర్యాదులు, సమస్యలపై తక్షణమే స్పందించి, వాటిని వేగంగా పరిష్కరించేందుకు తమిళనాడు పోలీస్ శాఖ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి వారం రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ‘ప్రజా సమస్యల పరిష్కార శిబిరాలను’ నిర్వహించాలని డీజీపీ మహేష్ కుమార్ అగర్వాల్ అన్ని జిల్లాల పోలీస్ అధికారులను ఆదేశించారు.
నిర్దేశిత రోజులు, సమయాలు
ప్రతి వారం బుధవారం, శనివారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ శిబిరాలు జరుగుతాయి. ఈ సమయాన్ని ప్రత్యేకంగా ప్రజా సమస్యల పరిష్కార దినాలుగా పరిగణిస్తారు. ఈ శిబిరాలు జరిగేరోజున ఐజీలు, డీఐజీలు, ఎస్పీలు, డీఎస్పీలు, పోలీస్ కమిషనర్లు తప్పనిసరిగా ఆయా సమయాల్లో తమ కార్యాలయాల్లో ఉండి నేరుగా ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించాలి. కార్యాలయాలకు వచ్చే సామాన్య ప్రజలతో అధికారులు అత్యంత గౌరవంగా, మర్యాదగా ప్రవర్తించాలని డీజీపీ స్పష్టం చేశారు. అధికారులకు కోర్టు పనులు, ఇతర సమావేశాలు లేదా శాంతిభద్రతల విధులు ఉన్నప్పటికీ, ప్రజలను ఎక్కువసేపు వేచి ఉంచకూడదని,. తమకు వీలుపడనప్పుడు తమ తదుపరి అసిస్టెంట్ అధికారుల ద్వారా అయినా ప్రజల సమస్యలను విని తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఉత్తర్వుల అమలు తీరును , అధికారులు స్పందిస్తున్న విధానాన్ని చైన్నెలోని పోలీస్ ప్రధాన కార్యాలయం నేరుగా పర్యవేక్షిస్తుందని డీజీపీ మహేష్ కుమార్ అగర్వాల్ హెచ్చరించారు.


