సాక్షి,చైన్నె : వివిధ క్రిమినల్ కేసుల్లో ముఖ్యమైన సాక్షులుగా ఉన్న పిల్లలు, మైనర్ల సంక్షేమాన్ని , వారి భద్రతను కాపాడేందుకు రూపొందించిన డ్రాఫ్ట్ గైడ్‌లైన్స్ (రక్షణ మార్గదర్శకాల ముసాయిదా) ప్రస్తుత పరిస్థితి ఏంటో తెలపాలని తమిళనాడు ప్రభుత్వం, హోంశాఖను మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. ఇందుకు సంబంధించిన కేసు విచారణ బుధవారం కోర్టు ముందుకు వచ్చింది.
గత విచారణ – వెబ్‌సైట్‌లో మార్గదర్శకాలు
వివిధ నేర కేసుల్లో సాక్షులుగా మారే పిల్లల మానసిక, శారీరక సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తగిన మార్గదర్శకాలను రూపొందించాలని కోరుతూ గతంలోనే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై గతంలో జరిగిన విచారణలో గైడ్‌లైన్స్ డ్రాఫ్ట్ సిద్ధంగా ఉందని, కేవలం జీవో కోసం ఎదురుచూస్తున్నామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీనిపై స్పందించిన కోర్టు.. ఈ ముసాయిదా మార్గదర్శకాలపై ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు తమ అభిప్రాయాలను, సూచనలను తెలియజేసేందుకు వీలుగా చైల్డ్ ప్రొటెక్షన్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కోర్టులో తాజా వాదనలు – కీలక మార్పులు
ప్రస్తుతం ఈ కేసు జస్టిస్ అనితా సుమంత్ , జస్టిస్ సుందర్ మోహన్‌తో కూడిన ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చింది. విచారణ సందర్భంగా తులసి అనే ఎన్‌జీఓ తరఫున హాజరైన న్యాయవాది విద్యా రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ ముసాయిదా మార్గదర్శకాల్లో పిల్లల భద్రతకు సంబంధించి మరికొన్ని కీలకమైన నిబంధనలను చేర్చాల్సిన అవసరం ఉందని కోర్టుకు విన్నవించారు. ఈ కేసులో కోర్టుకు సహాయకారిగా నియమితులైన సీనియర్ న్యాయవాది కుమార్ రాజరత్నం కూడా గైడ్‌లైన్స్‌ను మరింత బలోపేతం చేయడానికి కొన్ని ముఖ్యమైన సిఫార్సులను అందించారు.హైకోర్టు కీలక వ్యాఖ్యలు – ఆదేశం ఈ అంశంపై స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు కలిసి సంయుక్తంగా ఒక సమావేశాన్ని నిర్వహించి తుది నిర్ణయం తీసుకోవాలని న్యాయమూర్తులు ఆదేశించారు. అలాగే, ఈ రక్షణ మార్గదర్శకాల ప్రస్తుత స్థితిగతులపై పూర్తి వివరాలతో సమాధానం ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వానికి, పోలీసులకు నోటీసులు జారీ చేస్తూ.. తదుపరి విచారణను జూలై 14కు వాయిదా వేసింది.


