సాక్షి, చైన్నె : త్యాధునిక వైద్య సాంకేతిక పరిజ్ఞానం సాయంతో చైన్నెలోని ఎంజీఎం హెల్త్‌కేర్ వైద్యులు ఒక వృద్ధుడికి పునర్జన్మ ప్రసాదించారు. ఎమర్జెన్సీ యాంజియోప్లాస్టీ (రక్తనాళాల పునరుద్ధరణ) జరుగుతున్న సమయంలో గుండె పూర్తిగా ఆగిపోయిన (కార్డియాక్ అరెస్ట్) 69 ఏళ్ల రోగికి, అత్యంత వేగంగా ఎక్మో అనే కృత్రిమ గుండె–ఊపిరితిత్తుల సహాయక వ్యవస్థను అమర్చి ప్రాణాలు రక్షించారు. ఈ వివరాలను బుధవారం సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ బాబు ఏలుమలై బృందం మీడియాకు వివరించింది.
అత్యంత క్లిష్టమైన పరిస్థితి
సదరు వృద్ధుడు అత్యంత తీవ్రమైన గుండెపోటుతో ఆస్పత్రిలో చేరారని, వైద్యులు పరీక్షించగా, ఆయన గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన ధమని తో పాటు ఇతర ముఖ్యమైన రక్తనాళాలలో తీవ్రమైన బ్లాక్‌లు ఉన్నట్లు గుర్తించామన్నారు. దీనికి తోడు, గుండె శరీరావయవాలకు తగినంత రక్తాన్ని పంప్ చేయలేని ప్రాణాంతక స్థితి అయిన కార్డియోజెనిక్ షాక్‌కు ఆయన లోనయ్యారన్నారు. దీంతో వెంటనే ఎక్మో వైద్యాన్ని ప్రారంభించామన్నారు. ఈ విధానంలో రోగి శరీరం నుండి రక్తాన్ని ఒక బాహ్య యంత్రంలోకి పంపి, అక్కడ దానికి ఆక్సిజన్‌ను అందించి, తిరిగి శరీరంలోకి పంపించినట్టు తెలిపారు. ఇది తాత్కాలికంగా గుండె, ఊపిరితిత్తుల బాధ్యతను పూర్తిగా తన భుజాలపై వేసుకుని, గుండె పనిచేయని స్థితిలో కూడా శరీరంలోని ముఖ్య అవయవాలకు రక్తప్రసరణ, ఆక్సిజన్ అందేలా కాపాడిందన్నారు. ఎక్మో సాయంతో రోగి రక్తప్రసరణ స్థిరపడిన తర్వాత సంక్లిష్టమైన యాంజియోప్లాస్టీ ప్రక్రియను పూర్తి చేసి, స్టెంట్లు వేసి బ్లాక్‌లను విజయవంతంగా తొలగించామన్నారు. రోగి పూర్తిగా కోలుకుని నడవగలిగే స్థితిలో ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యారని వివరించారు.


