ఫ్యాన్సీ నంబర్ల్లు ఇక కాస్ట్ల్లీ | - | Sakshi
Sakshi News home page

ఫ్యాన్సీ నంబర్ల్లు ఇక కాస్ట్ల్లీ

Jun 23 2026 11:53 PM | Updated on Jun 23 2026 11:53 PM

– ఫీజులను భారీగా పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయం

సాక్షి, చైన్నె : తమిళనాడులో విలాసవంతమైన, ప్రత్యేకమైన ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్‌ నంబర్లను ఇష్టపడే వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం గట్టి షాక్‌ ఇచ్చింది. ద్విచక్ర , నాలుగు చక్రాల వాహనాల ప్రత్యేక నంబర్ల కేటాయింపునకు సంబంధించి ప్రస్తుతం ఉన్న స్థిర రుసుము విధానాన్ని రద్దు చేస్తూ, వాహనం విలువ ఆధారంగా సరికొత్త రుసుము విధానాన్ని ప్రవేశపెట్టేందుకు రవాణా శాఖ ఒక ముసాయిదా నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీని ప్రకారం ఫ్యాన్సీ నంబర్ల ధరలు రూ. 2వేల నుంచి గరిష్టంగా రూ. 10 లక్షల వరకు పెరగనున్నాయి. రిజిస్ట్రేషన్‌ నంబర్ల కేటాయింపులో మధ్యవర్తులు, అవినీతికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా రవాణా శాఖ ఈ కీలక మార్పులు చేస్తోంది.

వాహనం విలువ ఆధారంగా కొత్త ఫీజులు

ఇప్పటివరకు ఉన్న సాధారణ కనీస రుసుములను రద్దు చేసి, వాహనం మార్కెట్‌ విలువను బట్టి ఫీజులను నిర్ణయించనున్నారు. వాహనాల విలువను బట్టి అదనపు రుసుము రూ. 2,000 నుంచి రూ. 1 లక్ష వరకు పెరుగనున్నది.

హై–వాల్యూ వాహనాలు

రూ. 30 లక్షల నుంచి రూ. 50 లక్షల పైబడిన విలువ గల లగ్జరీ వాహనాలకు గరిష్టంగా రూ. లక్ష వరకు అదనపు రుసుము ఉంటుంది. అలాగే, విదేశాల నుండి దిగుమతి చేసుకునే లగ్జరీ వాహనాల నంబర్‌ ప్లేట్ల ధరలు వాటి విలువను బట్టి రూ. 20,000 నుండి రూ. 1.5 లక్షల వరకు (రూ. 3.4 లక్షల వరకు విలువ గల వాహనాలకు) వసూలు చేయనున్నారు. ఇది ప్రస్తుతం అమల్లో ఉన్న రూ. 1,000 నుండి రూ. 3,000 – రూ. 16,000 కనీస రుసుము కంటే చాలా రెట్లు ఎక్కువ కావడం గమనార్హం.

కొత్తగా ప్రీమియం’ కేటగిరీ పరిచయం

అదృష్ట సంఖ్యలు, ప్రత్యేక సిరీస్‌ నంబర్ల కోసం డిమాండ్‌ను బట్టి ప్రభుత్వం కొత్తగా ప్రీమియం కేటగిరీని తీసుకురానుంది. ఇందులో సిరీస్‌ల వారీగా ఫీజులను నిర్ణయించారు. 10వ, 12వ సిరీస్‌ లోని ప్రత్యేక నంబర్ల కోసం రూ. 2 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. 12వ, 13వ సిరీస్‌ లోని మరికొన్ని ప్రముఖ నంబర్ల ధర రూ. 4 లక్షలుగా నిర్ణయించారు. 13వ, 4వ తాత్కాలికేతర రిజిస్ట్రేషన్‌ సిరీస్‌ లోని అత్యంత డిమాండ్‌ గల నంబర్ల కోసం ప్రత్యేక ప్రీమియం’ కేటగిరీని కేటాయించారు. ఈ లగ్జరీ నంబర్ల ధరను ఏకంగా రూ. 10 లక్షలుగా ముసాయిదాలో ప్రతిపాదించారు.ఈ ఫ్యాన్సీ నంబర్ల జారీకి రాష్ట్ర ప్రభుత్వం తుది ఆమోదం తప్పనిసరి. కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే ఆన్‌లైన్‌ వేలం ప్రక్రియలో మరిన్ని పారదర్శక మార్పులు రానున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement