సాక్షి, చైన్నె: తమిళనాడు రాష్ట్ర దీర్ఘకాలిక విద్యుత్ డిమాండ్‌ను పర్యావరణహిత పద్ధతిలో తీర్చడానికి, పునరుత్పాదక ఇంధన వనరులను భారీగా వృద్ధి చేయడానికి తమిళనాడు గ్రీన్‌ఎనర్జీ కార్పొరేషన్ ఒక విప్లవాత్మక ప్రణాళికను సిద్ధం చేసింది. సుమారు రూ.1.02 లక్షల కోట్ల అంచనా వ్యయంతో 25,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గల భారీ సమగ్ర గ్రీన్ ఎనర్జీ పార్క్ ఏర్పాటుకు సంబంధించి న వివరణాత్మక ప్రాజెక్ట్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉంది. తమిళనాడు చరిత్రలోనే ఇప్పటివరకు ప్రతిపాదించిన అతిపెద్ద పునరుత్పాదక ఇంధన ప్రాజెక్ట్ ఇదే కావడం గమనార్హం.
ఐదేళ్ల యాక్షన్ ప్లాన్
ఈ మెగా ప్రాజెక్ట్‌ను ఐదు దశల్లో పూర్తి చేసేలా కాలక్రమ పట్టికను రూపొందించారు. మొదటి సంవత్సరంలో ప్రాథమిక సబ్‌స్టేషన్ల నిర్మాణం, పవర్ గ్రిడ్ అనుసంధానంతో 3,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి పనులు ప్రారంభమవుతాయి. తదుపరి దశలో ఉత్పత్తి సామర్థ్యాన్ని క్రమంగా విస్తరిస్తూ రాష్ట్ర ప్రసార గ్రిడ్‌కు అనుసంధానిస్తారు. మైక్రోగ్రిడ్ సర్దుబాటు, రియల్–టైమ్ డేటా పర్యవేక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేస్తారు. చివరి దశలో ఐదు సంవత్సరాల కాలంలో 25 వేల మెగావాట్ల పూర్తి విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం అందుబాటులోకి రానుంది.
భూసేకరణ ప్రాంతాల గుర్తింపు
ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు 1.2 లక్షల ఎకరాల భూమి అవసరమవుతుందని అంచనా (ఒక మెగావాట్ సోలార్ విద్యుత్‌కు దాదాపు 1.2 ఎకరాలు). ముఖ్యంగా రామనాథపురం, తూత్తుకుడి జిల్లాలలో వ్యవసాయానికి ఉపయోగించని బీడు భూములను గుర్తించి ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. సాగు చేయని, సాగులో ఉన్న భూములను ఏకీకృతం చేయడానికి టిడ్కోను రంగంలోకి దించారు.


