మాజీ మంత్రి నెహ్రూకు ఊరట | - | Sakshi
Sakshi News home page

మాజీ మంత్రి నెహ్రూకు ఊరట

Jun 23 2026 11:53 PM | Updated on Jun 23 2026 11:53 PM

– జూలై 10 వరకు తదుపరి చర్యలు వద్దు

– మద్రాస్‌ హైకోర్టు ఆదేశం

సాక్షి,చైన్నె: గత డీఎంకే ప్రభుత్వ హయాంలో మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ శాఖలో జరిగినట్లుగా చెబుతున్న భారీ ఉద్యోగాల అవినీతి కేసులో మాజీ మంత్రి కే.ఎన్‌. నెహ్రూకు మద్రాస్‌ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. ఈ వ్యవహారంలో నమోదైన కేసుపై జూలై 10 వరకు ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోరాదని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సుశ్రుత్‌ అరవింద్‌ ధర్మాధికారి , జస్టిస్‌ జి. అరుళ్‌మురుగన్‌తో కూడిన ధర్మాసనం మంగళవారం ఈ కేసుపై విచారణ చేపట్టింది.

రూ. 634 కోట్ల లంచం ఆరోపణలు

గత డీఎంకే ప్రభుత్వ హయాంలో మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగంలో 2,538 మంది అసిస్టెంట్‌ ఇంజినీర్లు, జూనియర్‌ ఇంజినీర్ల నియామకాలకు సంబంధించి దాదాపు రూ. 634 కోట్ల మేర లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ పంపిన లేఖ ఆధారంగా.. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరపాలని అవినీతి నిరోధక శాఖను గతంలో మద్రాస్‌ హైకోర్టు ఆదేశించింది. అయితే, కోర్టు ఆదేశించినప్పటికీ కేసు నమోదు చేయకపోవడంతో అన్నాడీఎంకే ఎంపీ ఇన్బదురై కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. మరోవైపు ఈ కేసు నమోదు ఉత్తర్వులను పునఃసమీక్షించాలంటూ మాజీ మంత్రి కే.ఎన్‌. నెహ్రూ తరపున కూడా పిటిషన్లు దాఖలయ్యాయి.

కోర్టులో మారిన ప్రభుత్వాల స్టాండ్‌

ఈ కేసు విచారణ సందర్భంగా తమిళనాడులో చోటుచేసుకున్న రాజకీయ మార్పుల ప్రభావం స్పష్టంగా కనిపించింది. తమిళనాడు అడ్వకేట్‌ జనరల్‌ విజయ్‌ నారాయణ్‌ కోర్టులో వాదనలు వినిపిస్తూ.. గత డీఎంకే ప్రభుత్వం ఈ కేసు నమోదుకు వ్యతిరేకంగా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను ప్రస్తుత టీవీకే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని భావిస్తోందని, అందుకు అనుమతించాలని కోరు తూ కొత్తగా పిటిషన్‌ దాఖలు చేసినట్లు తెలిపారు.

నెహ్రూ తరఫున అభ్యంతరం

ప్రభుత్వం మారినంత మాత్రాన, గత ప్రభుత్వం తీసుకున్న స్టాండ్‌కు వ్యతిరేకంగా ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని తాము అంగీకరించబోమని నెహ్రూ తరపు న్యాయవాదులు వాదించారు. ప్రధాన కేసులో తమ పక్షం వివరణ వినకుండానే గతంలో ఆదేశాలు ఇచ్చారని, కాబట్టి ఆ ఉత్తర్వులను ఖచ్చితంగా పునఃసమీక్షించాలని కోరారు. కాగా వాదనల అనంతరం కేసును జూలై 10కి వాయిదా వేసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement