వేలూరు: ప్రతి రోజూ యోగా చేయడం వల్ల మానసిక ఒత్తిడి నుంచి బయట పడవచ్చునని రాజస్థాన్‌లోని మౌంట్ అబూ నుంచి వచ్చిన రాజయోగిని ఉషా దీదీ అన్నారు. తిరువణ్ణామలైలోని ప్రయివేటు కల్యాణ మండపంలో బ్రహ్మకుమారీస్ సంస్థ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం, బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విద్యాలయ సంస్థ 90 సంవత్సరాల మానవతా సేవను గుర్తించే కార్యక్రమం తిరువణ్ణామలై వ్యాపారుల సంఘం, లయన్స్, రోటరీ క్లబ్, ఎక్స్‌నోరా, తిరువణ్ణామలై తమిళ సంఘం, పెన్ ఫ్రెండ్స్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించింది. డాక్టర్ మాధవ చినరాజన్, ఎక్స్‌నోరా అధ్యక్షుడు డాక్టర్ ఇందిరరాజన్ పాల్గొన్నారు. రాజయోగిని మాట్లాడుతూ బ్రహ్మకుమారీస్ అందించే రాజయోగ ధ్యానం ఒక సరళమైన ధ్యాన పద్ధతి అన్నారు. ఇది మానసిక ప్రశాంతతను, ఆత్మ అవగాహనను , దేవునితో అనుబందాన్ని పెంచడానికి సహాయ పడుతుందన్నారు. యోగా చేయడం వల్ల దైవంతో అనుసంధానం, దేవుని గురించి ఉన్నతమైన ఆలోచనలను పెంపొందించుకోవడానికి దైవిక శక్తిని, ఏకాగ్రతను, మనం నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని పెంచుతుందన్నారు. అనంతరం యోగా చేసిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. రోటరీ క్లబ్ గవర్నర్ సురేష్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి గోమతి, రోటరీ సభ్యులు మన్నులింగం, ధనకోటి, కిషన్‌చంద్ పాల్గొన్నారు.


