అసెంబ్లీలో తొలిసారిగా సీఎం విజయ్‌ సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఇది సామన్యుడి ప్రభుత్వం అని వ్యాఖ్యలు చేశారు. ప్రజాహితం కాంక్షిస్తూ, అవినీతిని అంతం చేస్తామని స్పష్టం చేశారు. కేంద్రంతో ఘర్షణ వాతావరణంతో కాకుండా సంయమనంతో వ్యవహరిస్తామని ప్రకటించారు. | - | Sakshi
Sakshi News home page

అసెంబ్లీలో తొలిసారిగా సీఎం విజయ్‌ సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఇది సామన్యుడి ప్రభుత్వం అని వ్యాఖ్యలు చేశారు. ప్రజాహితం కాంక్షిస్తూ, అవినీతిని అంతం చేస్తామని స్పష్టం చేశారు. కేంద్రంతో ఘర్షణ వాతావరణంతో కాకుండా సంయమనంతో వ్యవహరిస్తామని ప్రకటించారు.

Jun 23 2026 11:53 PM | Updated on Jun 23 2026 11:53 PM

● కేంద్రంతో ఘర్షణ పడం ● ఎవరికీ బీ టీం మాత్రం కాదు ● అసెంబ్లీలో సీఎం విజయ్‌

అవినీతిని అంతం చేస్తాం

హక్కుల విషయంలో రాజీ పడం

రాష్ట్రంలో స్వయంప్రతిపత్తి అనేదే తమ విధాన మని సీఎం విజయ్‌ పేర్కొన్నారు. కేంద్రంతో అనవసర ఘర్షణలకు వెళ్లకపోయినా... రాజకీయ సిద్ధాంతాలను, రాష్ట్ర హక్కులను మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోమని స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రజలకు, మైనారిటీ సోదరులకు, తమకు మద్దతుగా నిలిచిన శ్రేణులకు ఎలాంటి సందేహాలు అవసరం లేదని, తాము ఎవరికీ ‘బి’ టీమ్‌ కాదని స్పష్టం చేశారు. నీట్‌ పరీక్షను వ్యతిరేకించడంలో తాము ఇప్పటికీ బలంగా ఉన్నామని, ప్రభుత్వ కార్యక్రమాల ప్రారంభంలో కచ్చితంగా తమిళ్‌ తాయ్‌ వాళ్తు ఆలపించాలన్నదే తమ స్టాండ్‌ అని స్పష్టం చేశారు. గతంలో రాష్ట్రపతి సభకు వచ్చిన సమయంలో తమిళ్‌ తాయ్‌ వాళ్తును రెండో స్థానంలోకి నెట్టిందెవరు..? అని డీఎంకే పై విరుచుకు పడ్డారు. చివరగా, రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యపై ప్రతిపక్షాలు అడుగుతున్న ప్రశ్నల్లో ఎలాంటి బాధ్యత కనిపించడం లేదని, కేవలం బురదజల్లే రాజకీయాలే చేస్తున్నాయని సీఎం విజయ్‌ విమర్శించారు. కాగా, అసెంబ్లీలో విజయ్‌ హావాభావాలు చర్చకు దారి తీశాయి. సభలో లేని మాజీ సీఎం స్టాలిన్‌ను టార్గెట్‌ చేస్తూ ఆయన హావాభావాలు వివాదానికి దారి తీశాయి.

అసెంబ్లీలో ప్రసంగిస్తున్న సీఎం విజయ్‌

సాక్షి, చైన్నె: అసెంబ్లీ సమావేశాలలో చివరి రోజైన మంగళవారం గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం విజయ్‌ తొలిసారిగా సుదీర్ఘ ప్రసంగం చేశారు. తనను టార్గెట్‌ చేసిన ప్రతి పక్షాల విమర్శలకు ఘాటుగా సమాధానం ఇచ్చారు. తానేదో సినిమా షూటింగ్‌ ముగించుకుని నేరుగా వచ్చి సీఎం పదవిలో కూర్చున్నట్లు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. 1990ల కాలం నుండే తాను పలు మార్గాల్లో ప్రజలకు అండగా నిలిచానని వివరించారు. తన సినిమాల్లో వీలైనంత వరకు అవినీతి నిర్మూలన, సామాజిక న్యాయం, విద్య, రాజకీయాల గురించి ప్రస్తావించానని గుర్తు చేశారు. అందుకే తన సినిమాలు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాయని, ఇప్పుడు కూడా ఎదుర్కొంటున్నట్టు వ్యాఖ్యలు చేశారు. అయితే, ప్రజలు తమను స్పష్టంగా అర్థం చేసుకున్నారు కాబట్టే తాజాగా అధికారంలో కూర్చోబెట్టారన్నారు.

40 రోజుల్లోనే ప్రజా రంజక పాలన

తాము అధికారంలోకి వచ్చిన కేవలం 40 రోజుల్లోనే అనేక ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేశామని సీఎం విజయ్‌ ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆ విజయాలను సభలో వివరించారు. మహిళల రక్షణ కోసం సింగప్పెన్‌ ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు, గృహ వినియోగదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, రైతులకు కురువై సాగు ప్యాకేజీ, పంట రుణాల మాఫీ, డ్రగ్స్‌ రహిత రాష్ట్రం కోసం ప్రత్యేక నిఘా విభాగం ఏర్పాటు, రాష్ట్రవ్యాప్తంగా 717 ప్రభుత్వ మద్యం దుకాణాల మూసివేత., అమ్మా క్యాంటీన్ల పునరుద్ధరణ, రిజిస్ట్రేషన్ల శాఖలో సాగుతున్న దోపిడీకి అడ్డుకట్ట గురించి విశదీకరించారు. అలాగే, తమ 40 రోజుల ఘనత, అవినీతి అంతానికి తీసుకుంటున్న చర్యలపై ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని గుర్తు చేస్తూ ఆ సంపాదకుడికి కృతజ్ఞతలు ప్రత్యేకంగా తెలియజేశారు.

చిన్న కథ, సైగ వివాదం

సభలో ఓ చిన్న కథను చెబుతూ... సీఎం విజయ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ పిల్లోడ్ని ఉద్దేశించి ఒకతను .. ఎక్కడ మీ తండ్రీ.. ఆయన్నే వెతుకుతున్నాను అంటూ ఆ కథలో వచ్చే లైన్‌ ఆధారంగా ఏదీ మీ తండ్రీ అంటూ పరోక్షంగా స్టాలిన్‌ను సభలో వెతుకుతున్నట్టుగా వ్యంగ్యంగా సైగతో విజయ్‌ చమత్కరించారు. అలాగే, గతంలో డీఎంకే కూటమిలో సీట్ల పందేరం ముగిసిన సమయంలో స్టాలిన్‌ చేసిన ఖేల్‌ ఖతం అన్న పరోక్ష సైగను అసెంబ్లీలో తాజాగా విజయ్‌ రిపీట్‌ చేస్తూ ప్రసంగాన్ని ముగించడం గమనార్హం.

సామాన్యుడి ప్రభుత్వం..

ఖజానా ఖాళీ చేసిన వారే విమర్శిస్తున్నారు

తమిళనాడు ఖజానాను పూర్తిగా ఖాళీ చేసి అప్పులపాలు చేసి వెళ్లారని గత డీఎంకే పాలకులను ఉద్దేశించి విరుచుకు పడ్డారు. ఈ పరిస్థితిని సృష్టించి, ఇప్పుడు తమకు పరిపాలన చేతకాదంటూ విమర్శిస్తున్నారని మండి పడ్డారు. తమకు ప్రజలకు సేవ చేయడం మాత్రమే తెలుసునని, ప్రజల సొమ్మును దోచుకోవడం తెలియదని విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో విద్యుత్‌ కోతలపై స్పందిస్తూ... తమిళనాడు మిగులు విద్యుత్‌ కలిగిన రాష్ట్రమే అయినప్పటికీ, గత ప్రభుత్వాల పరిపాలనా లోపాలు, ట్రానన్స్‌ఫార్మర్ల మరమ్మతులు, కొందరు కావాలనే చేస్తున్న కుట్రల వల్లే ఈ విద్యుత్‌ అంతరాయాలు ఏర్పడుతున్నాయని వివరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement