అసెంబ్లీలో ఈలల గోల | - | Sakshi
Sakshi News home page

అసెంబ్లీలో ఈలల గోల

Jun 23 2026 11:53 PM | Updated on Jun 23 2026 11:53 PM

● విజయ్‌ 30 నిమిషాల ప్రసంగంలో 10 రీల్స్‌ గ్యారంటీ ● ఉదయనిధి స్టాలిన్‌ ఫైర్‌

సాక్షి, చైన్నె : సీఎం విజయ్‌ తీరుపై ప్రధాన ప్రతి పక్ష నేత ఉదయ నిధి స్టాలిన్‌ అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ విరుచుకు పడ్డారు. అసెంబ్లీని కాస్తా సినిమా థియేటర్‌లా మార్చేశారని, సీఎం విజయ్‌ సభలో కృత్రిమంగా నటిస్తున్నారని మండిపడ్డారు.

సినిమా స్క్రిప్ట్‌ – డైరెక్టర్‌ గా స్పీకర్‌:

సీఎం విజయ్‌ ఎప్పటిలాగే సినిమా శైలిలో తనకు అందించిన స్క్రిప్ట్‌ను సభలో చదవి వినిపించారన్నారు. అసెంబ్లీలో ఆయన ఒక 30 నిమిషాలు మాట్లాడితే.. అందులో సోషల్‌ మీడియా కోసం ఒక 10 రీల్స్‌ సులభంగా తయారు చేసుకోవచ్చునని, అంతా పక్కా ప్రణాళిక ప్రకారమే చేస్తున్నారని ఎద్దేవాచేశారు. షూటింగ్‌ స్పాట్‌కు వచ్చి డైలాగులు కంఠస్థం చేసి, నటించి వెళ్లిపోయినట్లే సీఎం తీరు ఉందన్నారు. భవిష్యత్తులో అసెంబ్లీ ఆవరణలోకి క్యార్‌వాన్‌ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు. ఇక్కడ స్పీకర్‌ డైరెక్టర్‌లా, మంత్రులు అసిస్టెంట్‌ డైరెక్టర్లలా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. సీఎం విజయ్‌ ఎప్పుడు యాక్షన్‌, కట్‌ చెబుతారా అని స్పీకర్‌ చూస్తున్నట్లు ఉందని చమత్కరించారు.

అసెంబ్లీ ఈలల గోల

తమిళనాడు శాసనసభ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సభలో అధికార పక్ష సభ్యులు ఈలలు వేశారని ఉదయనిధి ఆరోపించారు. సభను సినిమా థియేటర్‌గా మార్చేసి, ఈలలు వేసే సంస్కతిని తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ముందు ముందు మంత్రులు ఎవరైనా పాటలు పెట్టుకుని డాన్స్‌ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు. ఒక పరిమితి దాటిన తర్వాత తాము భరించలేకపోయామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ప్రశ్నకూ సమాధానం లేదని, కేవలం బ్లేమ్‌ పాలిటిక్స్‌ అని, తాము అడిగిన ఏ ఒక్క ప్రజా సమస్యకు సీఎం నుండి స్పష్టమైన సమాధానం రాలేదని ఉదయనిధి విమర్శించారు. అసెంబ్లీలో సాంప్రదాయాలను ఉల్లంఘించారని, గవర్నర్‌ విషయంలో ప్రభుత్వం ఏం రాజీ పడిందో చెప్పలేదని, సీఎంకు కనీసం ప్రోటోకాల్స్‌ కూడా తెలియకపోవడం విచారకరంగా పేర్కొన్నారు.

అన్నాడీఎంకేతో లోపాయికారీ ఒప్పందం

ఎవరి దయాదాక్షిణ్యాలపైనా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని చెబుతున్న సీఎం, అన్నాడీఎంకేలోని ఒక వర్గాన్ని ఎందుకు కలవడానికి వెళ్లారు? అని ప్రశ్నించారు. ‘బ్యూరో పుల్లింగ్‌’ తరహాలో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని విరుచుకు పడ్డారు.

ఆ కథ తమిళనాడు మొత్తానికి తెలుసు..

అసెంబ్లీలో సీఎం విజయ్‌, ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్‌ మధ్య సాగిన మాటల యుద్ధం సామాజిక మాధ్యమాలకు కూడా పాకింది. శాసనసభలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సీఎం విజయ్‌ ప్రసంగిస్తూ.. ’తండ్రిని వెతుకుతున్న కొడుకు’ అంటూ ఒక చిన్న కథను (కుట్టి కథ) చెప్పడం సభలో తీవ్ర కలకలం రేపింది. ఈ కథపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్‌ ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా అత్యంత ఘాటుగా స్పందిస్తూ సీఎం గట్టి కౌంటర్‌ ఇచ్చారు.

ధైర్యం ఉంటే కోర్టుకు వెళ్ళండి!

అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న విజయ్‌, ధైర్యం ఉంటే ఆధారాలతో కోర్టుకు వెళ్లాలని ఉదయనిధి సవాల్‌ విసిరారు. బహిరంగ సభల్లో, ప్రచార వేదికల్లో మాట్లాడినట్లు అసెంబ్లీలో మాట్లాడటం కుదరదన్నారు. సీఎం పార్టీ ఫండ్‌ అంటూ ఆరోపణలు చేశారని, దమ్ముంటే అది ఏ పార్టీ ఫండో స్పష్టంగా చెప్పాలని, తాము దేనికై నా సిద్ధంగా ఉన్నామని సవాల్‌ చేశారు. తమ ఎన్నికల హామీలపై ఎక్కడా ప్రస్తావనే సభలో టీవీకే తీసుకు రాక పోవడం సిగ్గు చేటుగా వ్యాఖ్యలు చేశారు.

సినిమా కెమెరా అనుకుంటున్నారా?

అసెంబ్లీ లైవ్‌ కెమెరాను ఆయన సినిమా కెమెరాగా భావించి మాట్లాడేస్తున్నారని, ప్రసంగాన్ని ఒకే సింగిల్‌ టేక్‌ లో షూట్‌ చేయాలన్నట్లుగా స్పీకర్‌ పడిన తాపత్రయం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. సీఎం విజయ్‌ అసెంబ్లీలో తండ్రి–కొడుకుల కథను ప్రస్తావించడాన్ని ఉదయనిధి తప్పుపట్టారు. ‘ముఖ్యమంత్రి విజయ్‌ కుట్టి కథ చెబుతానంటూ చేసిన సైగలు, వ్యంగ్యాస్త్రాలు సభా మర్యాదలకు పూర్తిగా విరుద్ధం అంటూ ‘చెంగల్పట్టు కోర్టులో భర్తను వెతుకుతున్న భార్య’ కథ తమిళనాడు మొత్తానికి బాగా తెలుసునని పరోక్షంగా విజయ్‌ విడాకుల వ్యవహారం ప్రస్తావనతో కౌంట్‌ ఇచ్చారు. ఈ దృష్ట్యా, విజయ్‌ , తాను ఇంకా ఓ నటుడిని అనే విషయాన్ని మరిచిపోయి, ఇకనైనా సీఎం విజయ్‌గా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలంటూ ఉదయనిధి ఘాటు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement