సాక్షి, చైన్నె: శాసనసభలో మంగళవారం అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాడివేడి చర్చ సాగింది. సీఎం విజయ్ గత డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర అవినీతి, పరిపాలనా వైఫల్యాల ఆరోపణలు గుప్పించడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. సీఎం వ్యాఖ్యలను నిరసిస్తూ ప్రధాన ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ఆధ్వర్యంలో డీఎంకే సభ్యులు సభ నుండి వాకౌట్ చేశారు.
సీఎం విజయ్ ఘాటు వ్యాఖ్యలు
శాంతిభద్రతలు, డ్రగ్స్ రవాణాపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను సీఎం విజయ్ సభలో తిప్పికొట్టారు. శాంతిభద్రతలపై ఏదో బాధ్యతతో మాట్లాడుతున్నట్లు లేదని, కేవలం బురదజల్లే రాజకీయాలు చేస్తున్నాయని విరుచుకు పడ్డారు. గత 9, 10 నెలలుగా రాష్ట్రానికి కనీసం శాంతిభద్రతల డీజీపీ కూడా లేకుండా పాలన సాగించారని, అప్పట్లో హోంశాఖను చేతిలో పెట్టుకున్నవారు డ్రగ్స్ నియంత్రణను ఎందుకు పట్టించుకోలేదు? అని ప్రశ్నించారు. అలాగే, టాస్మాక్ (మద్యం దుకాణాలు) అవినీతిని ప్రస్తావిస్తూ... ప్రజాధనాన్ని దోచుకుని, అవినీతిపై అవినీతి చేసి, దాని నుండి తప్పించుకోవడమే పరిపాలనా సామర్థ్యం అనుకుంటే, అలాంటి సామర్థ్యం తమ ప్రభుత్వానికి ఎప్పటికీ అవసరం లేదన్నారు.. పెట్టెలకు పెట్టెలుగా డబ్బులు నింపుకుని, డ్రగ్స్ ప్రొటెక్షన్ కార్పొరేషన్‌లా వ్యవహరిస్తూ చేసిన ఒక్కో అవినీతి భాగోతం ఇప్పుడు బయటకు వస్తున్నదని విజయ్ మండిపడ్డారు. టాస్మాక్ నుంచి పార్టీ ఫండ్‌కు నిధిని మళ్లించారంటూ చేసిన వ్యాఖ్యలు దుమారానికి దారి తీసింది.
సభలో ఉద్రిక్తత – స్పీకర్ జోక్యం
సీఎం విజయ్ వ్యాఖ్యలతో డీఎంకే సభ్యులు ఒక్కసారిగా నిరసనకు దిగారు. స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్తూ నినాదాలు చేశారు. వీరికి కౌంటర్‌గా అధికార టీవీకే సభ్యులు కూడా రంగంలోకి దిగడంతో సభలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఓ దశలో స్పీకర్ స్పందిస్తూ, సీఎం ప్రసంగం ముగిసిన తర్వాత ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడే పూర్తి అవకాశం ఇస్తాను, సభ్యులు శాంతించాలని కోరారు. అనంతరం మంత్రులు సెంగోట్టయన్, రాజ్ మోహన్, , ఆధవ్ అర్జున తదితరులు డీఎంకే విమర్శలకు సమాధానమిచ్చారు.
ఆధారాలు ఉంటే నిరూపించండి
అనంతరం ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ అధికార పక్ష తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం విజయ్ సభలో ఎటువంటి ఆధారాలు లేకుండా తప్పుడు పదజాలం ఉపయోగించారని మండి పడ్డారు. పార్టీ ఫండ్ అంటూ ఆరోపణలు చేశారని, ధైర్యం ఉంటే అది ఏ పార్టీ ఫండో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఆధారాలతో సహా చెబితే తాము దేనికై నా సిద్ధంగా ఉన్నామన్నారు. తాను మాట్లాడి వెళ్లిపోయిన తర్వాత కూడా ఒక మంత్రి సభలో మాట్లాడుతుండటం ఏం సంప్రదాయం?‘ అని ప్రశ్నించారు. దీనిపై స్పీకర్ స్పందిస్తూ, ఒకవేళ సీఎం చేసిన ఆరోపణలకు సరైన ఆధారాలు లేకపోతే పరిశీలించి రికార్డుల నుండి తొలగిస్తామని హామీ ఇచ్చారు.
తగ్గేదే లేదన్న విజయ్.. డీఎంకే వాకౌట్
స్పీకర్ వివరణ తర్వాత కూడా సీఎం విజయ్ తన పంథాను మార్చుకోలేదు. వివిధ శాఖల్లో పార్టీ ఫండ్ పేరిట దోచుకున్న సొమ్ము ఇప్పుడు ప్రభుత్వ ఖజానాకు చేరుతోందన్నారు. ప్రజల సొమ్మును తాకనివ్వం, తాకిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ప్రతి అవినీతి త్వరలోనే బయటపడుతుందని స్పష్టం చేశారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన డీఎంకే సభ్యులు సభ నుండి వాకౌట్ చేశారు.


