26 గ్రూప్‌–1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ | - | Sakshi
Sakshi News home page

26 గ్రూప్‌–1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

Jun 23 2026 11:53 PM | Updated on Jun 23 2026 11:53 PM

సాక్షి, చైన్నె : ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి తమిళనాడు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కీలక ప్రకటన విడుదల చేసింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న గ్రూప్‌–1 కేటగిరీకి చెందిన మొత్తం 26 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ మంగళవారం జారీ చేసింది. ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు జూన్‌ 30 నుండి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని టీఎన్‌పీఎస్సీ స్పష్టం చేసింది.

భర్తీ చేయనున్న పోస్టులు ఇవే..

ఈ నోటిఫికేషన్‌ ద్వారా గ్రూప్‌–1 పరిధిలోని డిప్యూటీ కలెక్టర్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ కమర్షియల్‌ టాక్సెస్‌ , డెప్యూటీ రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కోఆపరేటివ్‌ సొసైటీస్‌,డిస్ట్రిక్ట్‌ రిజిస్ట్రార్‌ (రిజిస్ట్రేషన్‌ శాఖ), అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. జూన్‌ 30 నుంచి దరఖాస్తులకు శ్రీకారం చుట్టనున్నారు.దరఖాస్తులకు చివరి తేదీ జూలై 29గా ప్రకటించారు. గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ పరీక్ష తేదీ సెప్టెంబర్‌ 6వ తేదీగా వివరించారు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ (గ్రాడ్యుయేషన్‌) పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పరీక్ష రాయడానికి అర్హులుగా ప్రకటించారు. జనరల్‌ కేటగిరీలో గరిష్ట వయోపరిమితి 34 సంవత్సరాలుగా నిర్ణయించారు. రిజర్వేషన్‌ వర్గాలకు(బీసీ, ఎంబీసీ,ఎస్సీ, ఎస్టీ), నిరుపేద వితంతువులకు గరిష్ట వయోపరిమితిలో 5 ఏళ్ల సడలింపు ఉంటుందని, ఇక దివ్యాంగులకు అన్ని వర్గాల వారికి గరిష్ట వయోపరిమితిలో 10 ఏళ్ల సడలింపు లభిస్తుందని ప్రకటించారు. పరీక్షా విధానం, సిలబస్‌, ఫీజు పరీక్షా కేంద్రాల పూర్తి వివరాల కోసం అభ్యర్థులు కమిషన్‌ అధికారిక వెబ్‌సైట్‌ www.tnprc.gov.in సందర్శించవచ్చని తెలిపారు. త్వరలో ఇతర నోటిఫికేషన్లూ జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు.

డిజిటల్‌ సేవల్లో

చైన్నె కార్పొరేషన్‌ ముందంజ

– వాట్సాప్‌ ద్వారా 1.86 లక్షల మందికి లబ్ధి

సాక్షి, చైన్నె: ప్రజలకు నగరపాలక సంస్థ సేవలను మరింత వేగంగా, పారదర్శకంగా చేరవేసేందుకు గ్రేటర్‌ చైన్నె కార్పొరేషన్‌ ప్రవేశపెట్టిన వాట్సాప్‌ సేవలకు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది. ఈ వాట్సాప్‌ చాట్‌బాట్‌ మొబైల్‌ అప్లికేషన్‌ ద్వారా అందిస్తున్న 44 రకాల విభిన్న సేవలను గత 10 నెలల్లో ఏకంగా 1.86 లక్షల మంది నగరవాసులు వినియోగించుకున్నట్లు కార్పొరేషన్‌ అధికారులు మంళవారం ప్రకటించారు.ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరిగే పనిలేకుండా అత్యవసర, పౌర సేవలను మొబైల్‌ ద్వారానే సులభంగా పొందేందుకు వీలుగా గత ఏడాది ఆగస్టు 25, 2025న ఈ ప్రత్యేక వాట్సాప్‌ సేవా విభాగాన్ని చైన్నె కార్పొరేషన్‌ అధికారికంగా ప్రారంభించింది. ఈ సేవలు అందుబాటులోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు దాదాపు 10 నెలల కాలంలోనే 1,86,000 మందికి పైగా పౌరులు తమకు కావాల్సిన వినతులు, ధృవీకరణ పత్రాలు , సమాచారాన్ని దీని ద్వారా విజయవంతంగా పొందారని గ్రేటర్‌ చైన్నె కార్పొరేషన్‌ తన నివేదికలో పేర్కొంది. ఈ విధానం ద్వారా ప్రజలకు సమయం వృథా కాకుండా ఉండటమే కాకుండా, నగరపాలక సంస్థపై ప్రజల్లో నమ్మకం, జవాబుదారీతనం మరింత పెరిగిందని అధికారులు హర్షం వ్యక్తం చేశారు.

కోవైలో బలిదాన్‌ దివస్‌

సాక్షి, చైన్నె : భారత కేసరి డాక్టర్‌ శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ దేశ సార్వభౌమాధికారం, ఐక్యత కోసం చేసిన అత్యున్నత త్యాగాన్ని స్మరించుకుంటూ బలిదాన్‌ దివస్‌ కార్యక్రమాన్ని కోయంబత్తూరులో మంగళవారం నిర్వహించారు. కోయంబత్తూరు శివశక్తి నగర్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్మరణ కార్యక్రమంలో బీజేపీ సీనియర్‌ నాయకుడు డాక్టర్‌ పొంగులేటి సుధాకర్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్‌ శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ సెక్రటరీ ప్రొఫెసర్‌ పి. కనకసబాపతితో కలిసి డాక్టర్‌ సుధాకర్‌ రెడ్డి.. ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం అక్కడ చేరిన కార్యకర్తలను ఉద్దేశించి డాక్టర్‌ పొంగులేటి సుధాకర్‌ రెడ్డి ప్రసంగించారు. భారతదేశ సమగ్రత కోసం శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ చేసిన పోరాటాన్ని, ఆయన జీవిత విశేషాలను కొనియాడారు. ‘ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, రెండు గుర్తులు, ఇద్దరు ప్రధానులు ఉండటానికి వీల్లేదు (ఏక్‌ దేశ్‌ మే దో విధాన్‌, దో నిషాన్‌, దో ప్రధాన్‌ నహీ చలేంగే) అంటూ జమ్మూ కాశ్మీర్‌లో అప్పట్లో అమలులో ఉన్న పర్మిట్‌ విధానానికి వ్యతిరేకంగా పోరాడి ముఖర్జీ తన ప్రాణాలనే అర్పించారన్నారు. ఆర్టికల్‌ 370ని రద్దు చేయడం ద్వారా.. ముఖర్జీ కన్న అతిపెద్ద కల సాకారమైందన్నారు. ఇది దేశ జాతీయ సమగ్రతను మరింత బలోపేతం చేసిందన్నారు. దేశభక్తి, సుపరిపాలన , సమాజ సేవ అనే ఆదర్శాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement