అమోనియం గ్యాస్‌ లీకేజీ ఘటన.. | - | Sakshi
Sakshi News home page

అమోనియం గ్యాస్‌ లీకేజీ ఘటన..

Jun 23 2026 11:53 PM | Updated on Jun 23 2026 11:53 PM

● కార్మికుల మృతదేహాలు ఒడిశా అధికారులకు అప్పగింత ● సాయంత్రం విమానంలో స్వగ్రామాలకు తరలింపు

తిరువళ్లూరు: రొయ్యలు ఎగుమతి చేసే పరిశ్రమలో అమోనియం గ్యాస్‌ లీకేజీ కారణంగా మృతి చెందిన నాలుగు మృతదేహాలకు తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలలో పంచనామ పూరక్తి చేసి ఒడిశా కార్మిక సంక్షేమశాఖ అధికారి సౌమ్య నిరంజనకు తిరువళ్లూరు ఆర్డీవో రవిచంద్రన్‌ అప్పగించారు. ఈ మృతదేహాలను చైన్నె రాజీవ్‌గాంధీ ప్రభుత్వ వైద్యశాలలో ఉంచనున్నారు. వీటితో పాటూ రాజీవ్‌గాంధీ ప్రభుత్వ వైద్యశాల, స్టాన్లీ వైద్యశాలలో వున్న మృతదేహలను ఒకేచోటకు చేర్చి విమానం ద్వారా సాయంత్రం సొంత గ్రామాలకు చేర్చడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా ఊత్తుకోట తాలుకా కన్నిగైపేర్‌లో రొయ్యలను ఎగుమతి చేసే ఫ్యాక్టరీలో గత ఆదివారం అమ్మోనీయం లీకేజీ కారణంగా ప్రమాదం ఏర్పడి 69 మంది స్పృహా కోల్పోయిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. గాయపడిన వారిని వేల్స్‌ వైద్యశాలలో 27 మంది, వెంకటేశ్వర వైద్యశాలలో 18 మంది క్షతగాత్రులను వుంచి వైద్యసేవలను అందించారు. మెరుగైన చికిత్స కోసం రాజీవ్‌గాంధీ ప్రభుత్వ వైద్యశాలలో 11 మంది, స్టాన్లీ వైద్యశాలలో 13 మందిని తరలించారు. ప్రస్తుతం వేల్స్‌ వైద్యశాలలో చికిత్స పొందిన ఇద్దరి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిన క్రమంలో వారిని సోమవారం డిచార్జ్‌ చేశారు. అయితే వేల్స్‌ వైద్యశాలలో చికిత్స పొందుతూ వచ్చిన ముగ్గురు, వెంకటేశ్వర వైద్యశాలలో ఒకరు, రాజీవ్‌గాంధీ వైద్యశాలలో ఇద్దరు, స్టాన్లీ వైద్యశాలలో ముగ్గురితో పాటు సోమవారం ఉదయం నాటికి మృతుల సంఖ్య 9 మందికి చేరింది. వేల్స్‌ వైద్యశాలలో చికిత్స పొందిన జువానీజువాంగ్‌, పుల్‌మేణిజువాంగ అలియాస్‌ మలోతీ, సంభాతిజువాంగ, షిభాణీ తదితర నలుగురు మృతి చెందిన క్రమంలో వీరి మృతదేహాలను తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు శవపరీక్షల నిమిత్తం తరలించారు. ఈ నాలుగు మృతదేహాలకు సోమవారం పోస్టుమార్టం పూర్తి చేశారు. మృతదేహాల ముఖం ఛిద్రంగా మారిపోవడంతో వారిని గుర్తించడం, బంధువులకు అప్పగించడం ఆలస్యంగా మారింది. దీంతో ఒడిశాకు చెందిన అధికారులను సంఘటన స్థలానికి పిలిపించి మృతదేహాలను గుర్తించిన క్రమంలో మంగళళవారం ఉదయం ఒడిశా కార్మిక సంక్షేశాఖ అధికారి సౌమ్యకు తిరువళ్లూరు ఆర్డీవో రవిచంద్రన్‌ అప్పగించారు.

విమానం ద్వారా సొంత గ్రామాలకు..

తిరువళ్లూరు వైద్యశాల, స్టాన్లీ వైద్యశాలలో వున్న మృతదేహాలను రాజీవ్‌గాంధీ వైద్యశాలకు తరలించి అక్కడి నుంచి మొత్తం 9 మృతదేహాలను సాయంత్రం విమానం ద్వారా సొంత గ్రామాలకు తరలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement