తమిళసినిమా: ఇప్పుడు సోషల్ మీడియా విజృంభన మామూలుగా లేదు. సీమ చిటుక్కుమన్నా వార్తగా మారిపోతోంది. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో పాఠకుల ముందు ఉంచుతోంది. దీంతో చాలా మంది తమ ఎదుగుదలకు సోషల్ మీడియాను విచ్చలవిడిగా వాడుకుంటున్నారు. మరికొందరు మాత్రం షాక్ తగిలినట్లుగా భయపడిపోతున్నారు. కొన్ని సామాజిక మాధ్యమాలు గోరంతను కొండంత చేయడమే ఇందుకు కారణం కావచ్చు. మరికొన్ని వదంతులను ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే నిప్పు లేనిదే పొగ రాదుగా అనే వాదనను కొట్టి పారేయలేని పరిస్థితి. ఒక్కోసారి పరిస్థితులను బట్టి చేసిన వ్యాఖ్యలు ఆ తరువాత వారిని, విమర్శలకు గురి చేస్తుంటాయి. వాటి నుంచి బయట పడటానికి కొందరు నా వ్యాఖ్యలను వక్రీకరించారు అని ఎదురు దాడి చేస్తుంటారు. ఏదేమైనా ఇప్పుడు సోషల్ మీడియాకు కొందరు భయపడుతున్నారని చెప్పక తప్పదు. తమ గురించి జరుగుతున్న వదంతుల నుంచి బయట పడటానికి కొందరు సోషల్ మీడియాకే దూరం అవుతున్న పరిస్థితి. తాజాగా పాన్ ఇండియా క్రేజీ కథానాయకి, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కూడా సోషల్ మీడియా దెబ్బకు భయపడుతున్నట్లు తేట తెల్లమైంది. ఇందుకు చిన్న ఉదాహరణ తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలే.. సామాజిక మాధ్యమాల్లో ప్రముఖుల గురించి దొర్లుతున్న వదంతులపై మీ స్పందన అన్న ప్రశ్నకు రష్మిక మందన్నా బదులిస్తూ ఇప్పుడు ఏం మాట్లాడాలన్నా భయమేస్తోంది అని అన్నారు. ఏం మాట్లాడినా అది వేరే విధంగా బయటకు పోతోందన్నారు. అనని విషయాలను అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారన్నారు. అందువల్ల మనం గురించి ఎలాంటి వదంతి ప్రచారం అవుతుందేమోనని రోజూ భీతితో గడపాల్సిన పరిస్థితి నెల కొంటోందన్నారు. సోషల్ మీడియా ఎదుగుదల మంచిదేనని, అయితే దాన్ని కొందరు తప్పుగా వాడుతుండటమే వేదన కలిగిస్తోందని రష్మిక పేర్కొన్నారు.


