సాక్షి,చైన్నె: సాంకేతికత, సోషల్ మీడియా అల్గారిథమ్స్ మనుషుల ఆలోచనలను, వారి జీవన విధానాన్ని శాసిస్తున్న ఈ ఆధునిక యుగంలో.. ప్రతి ఒక్కరూ తమ అంతర్గత శక్తిని, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రముఖ రచయిత, న్యాయవాది కార్తికేయ వాజ్‌పాయ్ పేర్కొన్నారు. తన చైన్నె పర్యటనలో భాగంగా రామాపురంల్నో ఎస్‌ఆర్‌ఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ లో విద్యార్థులతో జరిగిన ముఖాముఖిలో తొలుత మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఆర్‌ఎం చైర్మన్ డాక్టర్ ఆర్. శివకుమార్, డీన్ డాక్టర్ ఎస్. తిరుమగన్, హెచ్‌ఓడి డాక్టర్ ప్రభాకరన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం అన్నాసాలైలోని చారిత్రాత్మక హిగ్గిన్ బోథ మ్స్ బుక్ స్టోర్‌లో జరిగిన తన నూతన పుస్తక ఆవిష్కరణ సభలలో ఆయన ప్రసంగించారు. పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ప్రచురించిన ది అన్‌బికమింగ్‌గా లెట్ లైఫ్ రివీల్ ఇట్స్ పర్పస్ పుస్తకాన్ని ఈ సందర్భంగా ఆయన ఆవిష్కరించారు. అనంతరం హిగ్గిన్‌బోథమ్స్ వేదికగా ప్రముఖ రచయిత, లీడర్‌షిప్ మెంటర్ శ్రీప్రకాష్ నాదదూర్ శ్రీధరన్‌తో కలిసి కార్తికేయ తన పుస్తకంపై ఆసక్తికరమైన చర్చ జరిపారు.
అల్గారిథమ్స్ మాయలో పడకండి
ఎస్‌ఆర్‌ఎం నావిగేటింగ్ లైఫ్ ఇన్ ది ఏజ్ ఆఫ్ అల్గా రిథమ్స్ అనే సదస్సులో కార్తికేయ వాజ్‌పాయ్ మాట్లాడుతూ.. డిజిటల్ యుగంలో మానసిక ఎదుగుదలకు ఎదురవుతున్న సవాళ్లను ప్రస్తావించారు. ప్రస్తుత కాలంలో అల్గారిథమ్స్ మనకు నచ్చిన గుర్తింపులను మనకే విక్రయిస్తున్నాయన్నారు. స్క్రీన్ టైమ్‌ను మేనేజ్ చేయడం కంటే.. ఆత్మగౌరవాన్ని, స్వీయ విలువను కాపాడుకోవడమే ఈ తరం ముందున్న అతిపెద్ద సవాలుగా పేర్కొన్నారు.డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు బాహ్య ప్రపంచం నుండి గుర్తింపును కోరుకునేలా చేస్తూ ఏకాగ్రతను దెబ్బతీస్తున్నాయన్నారు. సాంకేతికతను,కృత్రిమ మేధ ను వద్దనకూడదని, అయితే, దానిని స్పృహతో, స్పష్టమైన అవగాహనతో వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.


