హెర్నియా చికిత్సలో అత్యాధునిక విధానాలు | - | Sakshi
Sakshi News home page

హెర్నియా చికిత్సలో అత్యాధునిక విధానాలు

Jun 23 2026 11:53 PM | Updated on Jun 23 2026 11:53 PM

– చైన్నెలో ఈ–టెప్‌ మాస్టర్‌ క్లాస్‌ సదస్సు

సాక్షి, చైన్నె : హెర్నియా చికిత్సలలో అత్యాధునిక విధానం అమలు గురించి చైన్నెలో ఈ టెప్‌ మాస్టర్‌ క్లాస్‌ సదస్సు మంగళవారం జరిగింది. హెర్నియా , పొట్ట గోడల పునర్నిర్మాణ చికిత్సా విధానంలో వస్తున్న సరికొత్త సాంకేతిక మార్పులపై సర్జన్లకు అవగాహన కల్పించారు. అసోసియేషన్‌ ఆఫ్‌ సర్జన్స్‌ ఆఫ్‌ ఇండియా – తమిళనాడు స్టేట్‌ చాప్టర్‌ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన చైన్నె ఈ–టెప్‌ మాస్టర్‌ క్లాస్‌’ 3వ ఎడిషన్‌ సదస్సు విజయవంతంగా అత్యాధునిక చికిత్స విధానాల గురించి వైద్యులు,నిపుణుల బృందాలు చర్చించాయి. మారుతున్న ఆధునిక వైద్య శాస్త్రాన్ని విస్తృతంగా ప్రచారం చేయడమే లక్ష్యంగా ఈ విద్యా కార్యక్రమాన్ని రూపొందించారు.ఈ మాస్టర్‌ క్లాస్‌ సదస్సులో భారతదేశానికి చెందిన ప్రముఖ సర్జన్లతో పాటు అమెరికా, యూరప్‌, ఆస్ట్రేలియా దేశాల నుండి వచ్చిన అంతర్జాతీయ వైద్య నిపుణులు పాల్గొన్నారు. అనుభవజ్ఞులైన సర్జన్ల ప్రసంగాలు, అత్యాధునిక శస్త్రచికిత్సల వీడియో ప్రదర్శనలు, మల్టీడిసిప్లినరీ చర్చలు , వివిధ క్లిష్టమైన కేసుల విశ్లేషణల ద్వారా ప్రస్తుతం హెర్నియా చికిత్సలో అందుబాటులోకి వచ్చిన అడ్వాన్స్‌డ్‌ పద్ధతులను వివరించారు. ఈ సదస్సుకు ఆర్గనైజింగ్‌ చైర్మన్‌గా వ్యవహరించిన డాక్టర్‌ రవీంద్రన్‌ కుమరన్‌ మాట్లాడుతూ.. హెర్నియా శస్త్రచికిత్స జరిగిన తర్వాత అది మళ్లీ తిరగబెట్టే ప్రమాదాన్ని పూర్తిగా తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా పేర్కొంటూ, అందుకోసమే ఈ రంగంలో ప్రత్యేక నైపుణ్యం సాధించిన సర్జన్లు హెర్నియాలజిస్ట్‌లుగా మారుతున్నారని వివరించారు. నేషనల్‌ ఏఎస్‌ఐ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ మరుదుపాండి మాట్లాడుతూ.. అబ్డామినల్‌ వాల్‌ పునర్నిర్మాణ రంగంలో సర్జికల్‌ విద్యను ప్రోత్సహించడానికి , రోగుల సంరక్షణను మెరుగుపరచడానికి నిరంతరం కట్టుబడి ఉన్నామన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement