మారుదాం.. మార్చుదాం | - | Sakshi
Sakshi News home page

మారుదాం.. మార్చుదాం

Jun 5 2026 11:59 PM | Updated on Jun 5 2026 11:59 PM

బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై కొత్త రాజకీయ ఉద్యమం వీ ది లీడర్‌ వెబ్‌లో చేరికకు పిలుపు నా మార్గం వేరు.. లక్ష్యం పెద్దది అని వ్యాఖ్య

సాక్షి, చైన్నె: తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కె. అన్నామలై సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన చేసిన రాజీనామాను అధిష్టానం ఆమోదించిన కొద్ది గంటల్లోనే, సరికొత్త రాజకీయ ప్రస్థానాన్ని ప్రకటించారు. తమిళనాడులో మరింత మంది ప్రజలను అనుసంధానించేలా ‘మారుదాం.. మార్చుదాం’ అనే నినాదంతో ఒక సరికొత్త రాజకీయ విప్లవానికి ఆయన శ్రీకారం చుట్టారు. తమిళనాడు బిజేపీ బలోపేతంలో మాజీ ఐపీఎస్‌ అధికారి పాత్ర కీలకం అన్నది జగమెరిగిన సత్యం. అయితే, అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా అన్నాడీఎంకే ఒత్తిడి మేరకు ఆయన్ను బీజేపీ అధిష్టానం తప్పించి నైనార్‌ నాగేంద్రన్‌కు పగ్గాలు అప్పగించింది. అయినా, పార్టీకి సేవలు అందిస్తూ వచ్చిన అన్నామలైకు అధిష్టానం రూపంలో ఎలాంటి పదవీ దక్కలేదు. దీంతో రెండు రోజులుగా ఢిల్లీలో తిష్ట వేసిన అన్నామలై బీజేపీకి రాజీనామా చేశారు. ఈ రాజీనామాను ఆ పార్టీ ఆమోదించిన కొన్ని గంటలలో శుక్రవారం మధ్యాహ్నం అన్నామలై సోషల్‌ మీడియా వేదికగా తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు.

బీజేపీకి రాజీనామా ఎందుకు?

2020 ఆగస్టులో బీజేపీలో చేరిన తాను తమిళనాడులో పార్టీ బలోపేతానికి తీవ్రంగా శ్రమించానని గుర్తు చేశారు. అయితే, గత 18 నెలలుగా పార్టీ జాతీయ నాయకత్వంతో తమిళనాడు రాజకీయ వ్యూహాలు, కూటములపై తనకు కొన్ని భేదాభిప్రాయాలు (ముఖ్యంగా అన్నాడీఎంకేతో పొత్తు విషయంలో) ఉన్నాయని ఆయన వివరించారు.

నా మార్గం వేరు, నా లక్ష్యాలు చాలా పెద్దవి :

తమిళనాడులో ఒక సరికొత్త రాజకీయ సంస్కృతిని, మూలాల నుంచి మార్పును తీసుకురావాలన్నదే తన ఆశయంగా ప్రకటించారు. ఈ విషయాన్ని బీజేపీ అగ్రనాయకత్వానికి ఎంతో మర్యాదపూర్వకంగా వివరించి, పార్టీ నుంచి బయటకు వచ్చానని వివరించారు.

సరికొత్త రాజకీయ ఉద్యమం– వీ ది లీడర్‌

అన్నామలై తన కొత్త రాజకీయ ప్రయాణాన్ని కేవలం ఒక పార్టీగా కాకుండా, ప్రజల భాగస్వామ్యంతో కూడిన ఒక పెద్ద ఉద్యమంగా అభివర్ణించారు. వీ ది లీడర్‌ పేరిట ఈ ఉద్యమం సాగుతుందని ప్రకటించారు. ఈ ఉద్యమం త్వరలోనే పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా రూపాంతరం చెందుతుందని, రాబోయే సాధారణ ఎన్నికల్లో తమ పార్టీ ఖచ్చితంగా పోటీ చేస్తుందని ప్రకటించారు.

డిజిటల్‌ ప్లాట్‌ఫారమ్‌

యువత, ప్రజలు ఈ ఉద్యమంలో భాగస్వాములు కావడానికి ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రారంభించామని ప్రకటించారు. రాజకీయాల్లో నైతికతను పెంపొందించడానికి కోయంబత్తూరులో అబ్దుల్‌ కలాం పేరిట సెంటర్‌ ఫర్‌ ఎథిక్స్‌ అండ్‌ పాలిటిక్స్‌ అనే సంస్థను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. దీని ద్వారా కొత్త నాయకులకు, వాలంటీర్లకు శిక్షణ ఇస్తామన్నారు.

అన్నామలై ఉద్యమంలో ముఖ్యాంశాలు

ఈ కొత్త ఉద్యమంలోని విధానం, పరిమితుల మేరకు పార్టీలో శాశ్వత ఎమ్మెల్యేలు, శాశ్వత ఎంపీలు అనే సంస్క్కృతిని బద్దలు కొడతామని, పదవీ కాలానికి ఖచ్చితమైన పరిమితులు ఉంటాయని, సాంకేతిక ప్రపంచవ్యాప్తంగా ఉన్నత స్థానాల్లో ఉన్న తమిళ సాంకేతిక నిపుణులను రాష్ట్ర అభివృద్ధి కోసం రాజకీయాల్లోకి ఆహ్వానిస్తామని స్పష్టం చేశారు. నైతికత సోషల్‌ మీడియాలో తన మద్దతుదారులు ఎవరినైనా నొప్పించి ఉంటే క్షమాపణలు కోరారు.

ఇతర పార్టీలపై కొత్త వైఖరి

ప్రధాని నరేంద్ర మోదీపై తనకు ఎప్పటికీ అపారమైన గౌరవం ఉంటుందని అన్నామలై స్పష్టం చేశారు. అయితే, తమిళనాడు రాజకీయ క్షేత్రంలో తాము ఏ ఒక్క పార్టీకి వ్యతిరేకం కాదని తేల్చిచెప్పారు. డీఎంకే, అన్నాడీఎంకే, టీవీకే, పీఎంకే, ఎన్‌టీకే, డీఎండీకే వంటి పార్టీలను ఏ విధంగా చూస్తానో, ఇకపై బీజేపీని కూడా అలాగే చూస్తానని స్పష్టం చేశారు. తమకు ఎవరితోనూ పోటీ లేదని, ప్రజలే తమ నాణ్యతను చూసి ఎన్నుకుంటారని అని అన్నామలై ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడును దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టడమే తమ ఏకై క లక్ష్యమని, ఇందుకోసమే తన జీవితాన్ని అంకితం చేస్తానని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement