కాయిదే మిల్లత్‌కు ఘన నివాళి | - | Sakshi
Sakshi News home page

కాయిదే మిల్లత్‌కు ఘన నివాళి

Jun 5 2026 11:59 PM | Updated on Jun 5 2026 11:59 PM

● ఘనంగా జయంతి వేడుక ●చాదర్‌ సమర్పించిన సీఎం విజయ్‌ ● కాంగ్రెస్‌ వర్సెస్‌ డీఎంకే వార్‌

సాక్షి, చైన్నె: ఇండియన్‌ యూనియన్‌ ముస్లింలీగ్‌ వ్యవస్థాపకుడు కాయిదే మిల్లత్‌ మహ్మద్‌ ఇస్మాయిల్‌ 131వ జయంతి వేడుకను శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ట్రిప్లికేన్‌లోని పెద్ద మసీదు ఆవరణలోని ఆయన సమాధి వద్దకు వివిధ పార్టీల నేతలు తరలివచ్చారు. సీఎం విజయ్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేల బృందం అధికారిక నివాళులర్పిస్తూ సమాధి వద్ద చాదర్‌ను సమర్పించారు. ట్రిప్లికేన్‌లోని పెద్ద మసీదు వద్దకు పెద్ద ఎత్తున ముస్లీం సంఘాల నేతలు, రాజకీయ పార్టీ నాయకులు తరలి రావడంతో ఆ పరిసరాలు క్రిక్కిరిశాయి. ముస్లీం మత పెద్దలు ప్రత్యేక పాత్యహా నిర్వహించారు. అధికార పగ్గాలు చేపట్టినానంతరం ప్రపథమంగా ట్రిప్లికేన్‌ పెద్ద మసీదు వద్దకు సీఎం విజయ్‌, స్పీకర్‌ జేసీడీ ప్రభాకర్‌, మంత్రులు ఎన్‌ ఆనంద్‌, ఆధవఅర్జున, వెంకటరమణన్‌, ఎ.ఎమ్‌. షాజహాన్‌, మహ్మద్‌ పర్వేజ్‌ , ఎన్‌. మరియ విల్సన్‌ వచ్చారు. అలాగే, ప్రత్యేక ఆహ్వానితులు కేరళ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి పి.కె. కుంజాలికుట్టి , ఇండియన్‌ యూనియన్‌ ముస్లింలీగ్‌ జాతీయ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కె.ఎమ్‌.ఖాదర్‌ మొహిద్దీన్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్వి మహ్మద్‌ అబుబకర్‌ , ఎంపీ నవాజ్‌ ఖని, సమాచార శాఖ కార్యదర్శి రాజారామన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అ.అరుణ్‌ తంబురాజ్‌, పలువురు ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు పాల్గొని కాయిదే మిల్లత్‌ స్మారకానికి నివాళులర్పించారు. సీఎం విజయ్‌ చాదర్‌ను సమర్పించారు.

డీఎంకే వర్సెస్‌ కాంగ్రెస్‌

తమిళనాడు రాజకీయాల్లో డీఎంకే – కాంగ్రెస్‌ సుదీర్ఘ బంధానికి తెరపడిన తర్వాత ఇరు పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో విభేదాలు భగ్గుమంటున్నాయి. ఇందుకు చైన్నెలోని కాయిదే మిల్లత్‌ 131వ జయంతి వేడుకల సందర్భంగా ఆయన స్మారకం వద్ద పరస్పరం తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సీఎం విజయ్‌ వచ్చి వెళ్లినానంతరం మాజీ సీఎం, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ అక్కడ ఛాదర్‌ సమర్పించేందుకు నిర్ణయించారు. ఆయన నివాళుర్పించి అటు వెళ్లగానే అదే సమయంలో అక్కడకు టీఎన్‌సీసీ అద్యక్షుడు సెల్వపెరుంతొగైతో పాటు ఆ పార్టీ వర్గాలు వచ్చాయి. ఈ క్రమంలో అక్కడే ఉన్న డీఎంకే కార్యకర్తలకు, కాంగ్రెస్‌ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత, గందరగోళం నెలకొంది. చివరకు అక్కడున్న వారు పరిస్థితిని చక్కదిద్దారు. ఈ వ్యవహారంపై సెల్వపెరుంతొగై స్పందిస్తూ సుదీర్ఘ బంధం తెగిపోతే ఆ బాధ ఉంటుందని, ఈ వివాదాన్ని పెద్దది చేయవద్దన్నారు. తమిళనాడులో డీఎంకే నుంచి కాంగ్రెస్‌ బయటకు వచ్చేసిందని, ఇండియా కూటమి విషయంలో జాతీయ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఓప్రశ్నకు సమాధానం ఇచ్చారు. అనంతరం అన్నాడీఎంకే పార్టీల తరఫున నేతుల సమాధి వద్ద అంజలి ఘటించారు.

Advertisement
 
Advertisement
Advertisement