సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే పార్టీలో గత కొన్నేళ్లుగా సాగుతున్న అంతర్గత అధికార పోరాటం, చట్టపరమైన వివాదాలు మద్రాసు హైకోర్టులో పూర్తిగా ముగిశాయి. గతంలో పార్టీలో జరిగిన పరిణామాలను సవాలు చేస్తూ దాఖలైన అన్ని సివిల్ కేసులను పిటిషనర్లు వెనక్కి తీసుకోవడంతో, న్యాయస్థానం ఆయా కేసులను కొట్టివేస్తూ విచారణను ముగించింది. 2022, జూలై 11న అన్నాడీఎంకే పార్టీ నిర్వహించిన వివాదాస్పద జనరల్ కౌన్సిల్ సమావేశాన్ని, అందులో ఆమోదించిన తీర్మానాలను సవాలు చేస్తూ మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్‌సెల్వం, ఆయన మద్దతుదారులు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా తమను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ పన్నీరుసెల్వం, వైద్యలింగం, మనోజ్ పాండియన్, జేసీడీ ప్రభాకర్ సివిల్ దావాలు దాఖలు చేశారు.
మారిన పార్టీలు..వ్యూహాలు
ఈ కేసులు కోర్టులో పెండింగ్‌లో ఉండగానే తమిళనాడు రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మాజీ సీఎం ఓ.పన్నీర్‌సెల్వం, వైద్యలింగం, మనోజ్ పాండియన్ డీఎంకేలో చేరి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. మరో సీనియర్ నేత జేసీడీ ప్రభాకర్ విజయ్ నేతృత్వంలోని టీవీకేలో చేరి తాజాగా అసెంబ్లీ స్పీకర్ అయ్యారు. తాజాగా ఇతర పార్టీలలో తాము ఉండడంతో పాత అన్నాడీఎంకే వివాదాల కేసులను కొనసాగించడంలో అర్థం లేదని భావించి, ఆయా పిటిషన్లను ఉపసంహరించుకోవడానికి అనుమతించాలని కోర్టును కోరారు. దీనిని పరిశీలించిన జస్టిస్ కె. కుమరేష్ బాబు నేతృత్వంలోని బెంచ్, పన్నీరు, ఆయన మద్దతుదారులు దాఖలు చేసిన కేసులను ఉపసంహరించుకోవడానికి అనుమతిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మరోవైపు, అన్నాడీఎంకే పార్టీ పేరు, జెండా, రెండాకులు చిహ్నం ఉపయోగించకుండా పన్నీరు వర్గానికి వ్యతిరేకంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడి కె. పళనిస్వామి గతంలో వేసిన కేసును కూడా వెనక్కి తీసుకోవడానికి అనుమతించవలసిందిగా ఆయన తరఫున పిటిషన్ దాఖలైంది. ఈ అభ్యర్థనను సైతం అంగీకరించిన న్యాయమూర్తి, ఈ వివాదానికి సంబంధించిన అన్ని కేసులను అధికారికంగా ముగించారు. దీంతో, గత నాలుగేళ్లుగా తమిళనాడు రాజకీయాలను ఊపేసిన అన్నాడీఎంకే వివాదాల కోర్టు పోరాటానికి తెరపడింది.


