సాక్షి, చైన్నె: డీఎంకే మాజీ మంత్రి కేఎన్ నెహ్రూ ఉద్యోగాలకు లంచం వ్యవహారం కేసు ఉచ్చుగా మారింది. ఆయనపై కేసు నమోదు చేసినట్టు టీవీకే ప్రభుత్వం శుక్రవారం కోర్టుకు వివరించింది. అదే సమయంలో కోర్టు ఆదేశాలు పెండింగ్‌లో ఉండగా కేసు ఎలా పెడతారని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత డీఎంకే ప్రభుత్వంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో 2,538 మంది అసిస్టెంట్ ఇంజినీర్లు, జూనియర్ ఇంజినీర్ల పోస్టుల భర్తీ ప్రక్రియ జరిగింది. ఈ నియామకాల్లో రూ.634 కోట్లు చేతులు మారాయని ఆరోపిస్తూ, దీనిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని తమిళనాడు డీజీపీకి ఈడీ ఒక లేఖ రాసింది. దీని ఆధారంగా అన్నాడీఎంకే నేత ఇన్బదురై మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు, వెంటనే కేసు నమోదు చేయాలని గతంలో ఆదేశించింది. హైకోర్టు ఆదేశించినప్పటికీ ఏసీబీ కేసు నమోదు చేయకపోవడంతో ఇన్బదురై కోర్టు దిక్కార పిటిషన్ వేశారు. మరోవైపు, ఈ కేసు నమోదు ఉత్తర్వులను పునఃసమీక్షించాలంటూ గత డీఎంకే ప్రభుత్వం, అప్పటి మంత్రి కేఎన్ నెహ్రూ తరఫున కూడా పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ కేసులన్నింటి విచారణను హైకోర్టు జూన్ 23వ తేదీకి వాయిదా వేసింది.
హైకోర్టులో వాదనల జోరు
కోర్టు ధిక్కార కేసు పెండింగ్‌లో ఉన్న తరుణంలో, ఈ వివాదంపై ఏసీబీ ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిందని మాజీ మంత్రి నెహ్రూ తరఫు సీనియర్ న్యాయవాది అరవింద్ పాండియన్ శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి అరవింద్ ధర్మాధికారి, జస్టిస్ జి. అరుళ్ మురుగన్‌లతో కూడిన ధర్మాసనం దృష్టికి తెచ్చారు. రాష్ట్ర అడ్వకేట్ జనరల్ విజయ్ నారాయణ్ కూడా ఈ విషయాన్ని కోర్టుకు ధృవీకరించారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కేసుల విచారణ ఈ నెలాఖరున జరగాల్సి ఉందని, తర్వాత విచారణ జరిగే వరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోమని ఇది వరకటి అడ్వకేట్ జనరల్ కోర్టుకు హామీ ఇచ్చారన్నారు. అటువంటప్పుడు కోర్టు విచారణ పూర్తి కాకముందే కేసు ఎలా నమోదు చేస్తారు? అని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో సమగ్రమైన ఉత్తర్వులు జారీ చేస్తామని చీఫ్ జస్టిస్ బెంచ్ పేర్కొంది.


