– ఆరుగురికి గోల్డెన్ వింగ్స్
సాక్షి, చైన్నె: తమిళనాడు అరక్కోణంలోని ప్రతిష్టాత్మక హెలికాప్టర్ ట్రైనింగ్ స్కూల్ ఐఎన్‌ఎస్ రాజాళి లో ఆరుగురు భారత నౌకాదళ పైలట్ల పాసింగ్ అవుట్ పరేడ్ శుక్రవారం ఘనంగా జరిగింది. 106వ బ్యాచ్‌కి చెందిన హెలికాప్టర్ కన్వర్షన్ కోర్స్‌లో కఠినమైన విమానయాన, గ్రౌండ్ శిక్షణను విజయవంతంగా పూర్తిచేసుకున్న ఈ ఆరుగురు యువ ఆఫీసర్లకు తూర్పు నౌకాదళ కమాండ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ సుశీల్‌మీనన్ ప్రతిష్టాత్మక శ్రీగోల్డెన్ వింగ్స్‌శ్రీ ను బహూకరించారు. ఇండియన్ నావల్ ఎయిర్ స్క్వాడ్రన్ –561 పరిధిలో సుదీర్ఘంగా 22 వారాల పాటు సాగిన ఈ అత్యంత కఠినమైన శిక్షణ ముగింపు, యువ బృందాన్ని సంపూర్ణ యుద్ధ సన్నద్ధత కలిగిన ఏవియేటర్లుగా తీర్చిదిద్దింది. శిక్షణ కాలంలో అసాధారణ ప్రతిభ, అంకితభావం కనబరిచిన ముగ్గురు అధికారులకు ప్రత్యేక ట్రోఫీలను అందజేశారు. ఫ్లయింగ్‌లో ప్రథమ స్థానం: ఫ్లయింగ్ విభాగంలో మెరిట్ ఆర్డర్‌లో ప్రథమ స్థానంలో నిలిచిన సబ్ లెఫ్టినెంట్ అహోనా మజుందార్‌కు ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్–ఇన్–చీఫ్ రోలింగ్ ట్రోఫీ , గ్రౌండ్ సబ్జెక్టులలో ప్రథమ స్థానంలో నిలిచిన లెఫ్టినెంట్ శివమ్ సింగ్‌కు సబ్ లెఫ్టినెంట్ కుంటే మెమోరియల్ బుక్ ప్రైజ్ దక్కింది. అన్ని విభాగాల్లో కలిపి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన లెఫ్టినెంట్ అరుణ్ కుమార్‌కు ప్రతిష్టాత్మక కేరళ గవర్నర్ రోలింగ్ ట్రోఫీ లభించింది. ఈ శిక్షణ కేంద్రంలో 900 మందికి పైగా పైలట్లకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన హెలికాప్టర్ ఫ్లయింగ్ శిక్షణ ఇక్కడ పొందారు. తాజాగా పట్టభద్రులైన ఈ ఆరుగురు భారత నౌకాదళానికి చెందిన ఫ్రంట్‌లైన్ యూనిట్లలో, సముద్ర తీరాలలో నిఘా, శోధన–సహాయక చర్యల్లో నిమగ్నం కానున్నారు.


