సాక్షి, చైన్నె: 2026–27 ఆర్థిక సంవత్సరంలో దక్షిణ భారతదేశ పారిశ్రామిక పోటీతత్వాన్ని, స్థిరమైన వృద్ధిని వేగవంతం చేయడంపైనే తాము ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సదరన్ రీజియన్ చైర్మన్ శ్రీ పి. రవిచంద్రన్ ప్రకటించారు. చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినానంతరం చైన్నెలో మంగళవారం జరిగిన తన తొలి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారతదేశ ఆర్థిక పురోగతిలో దక్షిణ భారత్ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తోందన్నారు.. దేశ జీడీపీ లో దాదాపు 32 శాతం, దేశ తయారీ రంగ జీవీఏ లో 30 శాతం వాటాను దక్షిణ రాష్ట్రాలే అందిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. స్థిరమైన ధరల వద్ద ఆర్థిక సంవత్సరం 2025 లో దక్షిణ రీజియన్ ఉమ్మడి జీడీపీ రూ. 57.16 లక్షల కోట్లుగా నమోదైందని, దేశ సేవల రంగం లో దాదాపు 40 శాతం ఇక్కడి నుంచే వస్తోందని వివరించారు.
సీఐఐ ప్రధాన లక్ష్యాలు
ఈ ఏడాది సీఐఐ అక్సిలరేటింగ్ సౌత్ ఇండియాస్ కాంపిటీటివ్‌నెస్‌లో గ్రోత్, రెసిలిజెన్స్ , ఇన్‌క్లూజన్, సస్టైనబిలిటీ, ట్రస్ట్ అనే థీమ్‌తో పని చేయనుందని ప్రకటలించారు. తయారీ రంగం, ఎంఎస్‌ఎంఈ, డిజిటల్ ట్రాన్స్ ఫార్మేషన్ , ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం, గ్రీన్ ఎనర్జీ , ఇంధన భద్రత. నైపుణ్యాభివృద్ది, అగ్రి వాల్యూ చైన్, ఫుడ్ ప్రాసెసింగ్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, లాజిస్టిక్స్, గ్లోబల్ మార్కెట్స్ టూరిజం, స్పోర్ట్స్ ఎకానమీలపై దృష్టి పెట్టనున్నట్టు వివరించారు. దక్షిణ భారత్‌కు గ్రోత్ ఇంజిన్‌గా తమిళనాడు ఉందని దక్షిణ భారతదేశ పారిశ్రామిక, ఎగుమతి రంగాలలో తమిళనాడు అగ్రగామిగా కొనసాగుతోందని ప్రకటించారు. ఈ సందర్భంగా కొన్ని అంశాలను ప్రస్తావిస్తూ అనుమతుల విషయంగాప్రభుత్వానికి కొన్ని సిఫారసులు చేశారు. సమావేశంలో ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ కృష్ణ బోదనపు, రీజినల్ డైరెక్టర్ ఇంద్రనిల్ ఘోష్ పాల్గొన్నారు.


