చైత్ర మాసం
బ్రహ్మోత్సవాలు ప్రారంభం
తిరువళ్లూరు: పట్టణంలోని వైద్యవీరరాఘవుడి ఆలయంలో చైత్రమాసం బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభ మయ్యాయి. తిరువళ్లూరులోని వైద్య వీరరాఘవుడి ఆలయంలో ప్రతి ఏటా చైత్రమాసం బ్రహ్మోత్సవాలు పది రోజులపాటు జరగడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే ఉత్సవాలు బుధవారం ఉదయం 4.15 గంటలకు ధ్వజారోహణంతో ప్రారంభించారు. అనంతరం ఐదున్నర గంటలకు తంగసప్రం, 11 గంటలకు తిరుమంజనం, సాయంత్రం ఆరు ఏడు గంటలకు సింహవాహనంపై స్వామివారు శ్రీదేవి భూదేవిలతో కలసి భక్తులకు దర్శనమిచ్చారు. మూడవ రోజు శుక్రవారం ఉదయం గరుడసేవ, ఏడవ రోజు రథోత్సవం, తొమ్మిదవ రోజు తీర్థవారి ఉత్సవాలు జరగనున్నాయి.
విద్యార్థుల కోసం
కెరీర్ అడ్వాంటేజ్ ప్రోగ్రామ్
సాక్షి,చైన్నె : అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడి విద్యార్థులకు మంచి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా, బ్రిటన్‌కు చెందిన ప్రముఖ సౌతాంప్టన్ యూనివర్సిటీ కెరీర్ అడ్వాంటేజ్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం చుట్టింది. బుధవారం ఆ విద్యా సంస్థల, అడ్మిషన్ల విభాగం ప్రతినిధులు కీరన్ బ్రాడ్‌హెడ్, అమండా ప్రాక్టర్‌లు స్థానికంగా ప్రోగ్రామ్ వివరాలను తెలియజేశారు. విద్యార్థి యూనివర్సిటీ ఆఫర్‌ను అంగీకరించిన క్షణం నుంచే ఈ ప్రోగ్రామ్ ప్రారంభమవుతుందన్నారు. చదువు పూర్తి చేసిన తర్వాత కూడా ఐదేళ్ల వరకు గ్రాడ్యుయేట్లు కెరీర్ కన్సల్టెంట్ నుంచి వ్యక్తికరించిన మద్దతు, జాబ్ కోచింగ్ నెట్‌వర్కింగ్ అవకాశాలను పొందవచ్చు అని వివరించారు. భవిష్యత్తు దృష్ట్యా, విద్యార్థులందరికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో శిక్షణ తప్పనిసరి చేశామన్నారు.
వారిని ఇతర పనులకు వాడొద్దు
– కోర్టులో ఉద్యోగ సమాఖ్య పిటిషన్
సాక్షి,చైన్నె: తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థలోని డ్రైవర్లు, కండక్టర్లను ఇతర పనులకు వాడు కోవడంపై స్పందించాలని మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం సంబంధిత అధికారులను ఆదేశించింది. రవాణా ఉద్యోగుల సమాఖ్య దాఖలు దాఖలు చేసిన పిటిషన్‌పె న్యాయమూర్తులు సతీష్‌కుమార్, జ్యోతిరామన్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ప్రభుత్వ రవాణా సంస్థల్లో డ్రైవర్లు, కండక్టర్లుగా నియమితులైన వారిని కార్యాలయ పనులకు లేదా ఇతర విధులకు కేటాయించడం చట్టవిరుద్ధంగా ఆ పిటిషన్‌లో వివరించారు. 1995, 2005 నాటి ఒప్పందాలు, అలాగే 2018లో ప్రభుత్వం విడుదల చేసిన జీఓల ప్రకారం.. డ్రైవర్లు, కండక్టర్లను వారి విధులు మినహా ఇతర పనుల్లో నిమగ్నం చేయకూడదన్న నిబంధన ఉన్నట్టు సూచించారు. వేలాది మంది సిబ్బందిని ఇతర పనులకు కేటాయించడం వలన ప్రస్తుతం ఫీల్డ్‌లో ఉన్న డ్రైవర్లు, కండక్టర్లపై పనిభారం పెరుగుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈకారణంగా మిగిలిన సిబ్బంది అదనపు సమయం పనిచేయాల్సి వస్తోందన్నారు. డ్రైవర్లు, కండక్టర్లను కేవలం కేటాయించిన అసలు విధుల్లో మాత్రమే కొనసాగేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పిటిషనర్ల వాదనలను విన్న న్యాయమూర్తులు, ఈ అంశంపై స్పందించాలని రవాణా శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి, మేనేజింగ్ డైరెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాల ని ఉత్తర్వులు జారీ చేస్తూ తర్వాత విచారణను వాయిదా వేశారు.
తిరువొత్తియూరు: నాగపట్నం జిల్లా వేదారణ్యం సమీపం వానవన్మహాదేవికి చెందిన జాలరి కుమార్ (36), తన ఫైబర్ బోటులో అదే ప్రాంతానికి చెందిన కదిర్వేల్ (54), మురుగపాండి (51), రాజ్ (50) లతో కలసి మంగళవారం ఉదయం వేటకు వెళ్లారు. కోడియక్కరైకి ఆగ్నేయంగా నడిసముద్రంలో మంగళవారం రాత్రి వారు చేపలు పడుతుండగా ఆ మార్గంలో గస్తీకి వచ్చిన శ్రీలంక నౌకాదళం వారిపై దాడి చేసింది. మత్స్యకారుల బోటులోకి ఎక్కి 200 కిలోల వలలను కత్తిరించి నష్టం కలిగించారు. అంతేకాకుండా నలుగురు మత్స్యకారులను తీవ్రంగా కొట్టారు. గాయపడిన జాలర్లు బుధవారం ఉదయం తీరానికి చేరుకున్నారు. సమాచారం తెలుసుకున్న మత్స్యశాఖ అధికారులు వారిని చికిత్స నిమిత్తం నాగపట్నం ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. వేదారణ్యం కోస్టల్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


