తిరువొత్తియూరు: రెండు కార్లు ఢీకొని దూసుకెళ్లిన ఘటనలో ఇద్దరు దుర్మరణం చెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. తిరుచ్చి జిల్లా, తొట్టియం తాలూకా, కాట్టుపుత్తూరు ప్రాంతంలో అన్బళగన్ మాంసం దుకాణం నిర్వహిస్తున్నాడు. ఇతని దుకాణం ముందు నలుగురు నిలబడి మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో ఆ మార్గం గుండా నామక్కల్ ప్రాంతానికి చెందిన కౌశిక్, తల్లితో కారు నడుపుకుంటూ వెళ్తున్నాడు. అదేసమయంలో వెనుక నుంచి వచ్చిన మరో కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న కౌశిక్ కారును ఢీకొంది. ఈప్రమాదంలో కౌశిక్ నడుపుతున్న కారు రోడ్డు పక్కన దుకాణం ముందు నిలబడి ఉన్న వారిని ఢీకొని మాంసం దుకాణంలోకి దూసుకెళ్లింది. ఈప్రమాదంలో చిన్నపల్లిపాళయం ప్రాంతానికి చెందిన సుభాష్ (40), శ్రీ రామసముద్రం ప్రాంతానికి చెందిన కొడియరసు (45) అక్కడికక్కడే మృతిచెందారు. రమేష్, వడివేల్, కారులో ఉన్న కౌశిక్ (35), అతని తల్లి ఈశ్వరి (60) తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కొరుక్కుపేట: ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగం లక్షలాది కొత్త ఉద్యోగాలను సృష్టిస్తోందని హాంకాంగ్‌కు చెందిన నిపుణురాలు షర్మిలా సంద్రాసెగరన్ అన్నారు. చైన్నెస్ అమృత ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏవియేషన్ (సీఏఐఐ ఏ)లో రెండు రోజుల అంతర్జాతీయ విమానయాన శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. కార్యక్రమం చైన్నె మౌంట్ రోడ్డులోని ఇన్‌స్టిట్యూట్ క్యాంపస్‌లో జరిగిన శిక్షణ కార్యక్రమంలో షర్మిలా సంద్రాసెగరన్ విద్యార్థులకు ప్రపంచ విమానయాన రంగంలో విలువైన అనుభవాన్ని వివరించారు. అనంతరం ఉన్నత నైపుణ్యాలను ప్రదర్శించిన అసాధారణ విద్యార్థులను షర్మిల సత్కరించారు. చైన్నె అమృత గ్రూప్ ఆఫ్ ఇన్‌స్ట్టిట్యూషన్స్ చైర్మన్ ఆర్.భూమినాథన్ ప్రముఖులను సత్కరించారు.
వేలూరు: వేలూరు వీఐటీ మారిషస్ ఆధ్వర్యంలో టెక్నాలజీ ఐడియాతాన్ పోటీలు ఆన్‌లైన్‌లో నిర్వహించారు. వీటిని ఇంజినీర్లు, శాస్త్రవేత్తల సంస్థలతో కలిసి జరిపారు. వీటిలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 3,500 మందికి పైగా కొత్త సలహాలు, సూచలను సమర్పించారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ మారిషస్, ఇండియ, మలేషియా, ఫిలిప్పైన్స్, అమెరికా వంటి ఐదు దేశాలకు చెందిన 297 విద్యా సంస్థల నుంచి 1,612 మంది పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా సహకారాలు ఉత్సాహ పరిచే విధంగా ఐడియాతాన్ పోటీల్లో ఆఖరి రౌండ్‌లో 200 టీమ్‌లు, పారిశ్రామిక వేత్తలు, విద్యా వేత్తలు పలు కరపత్రాలను అందజేశారు. 2026 సంవత్సరానికిగాను విద్యా స్కాలర్‌ష్‌ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వీఐటీ యూనివర్సిటీ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.
తిరువొత్తియూరు: భార్యను కడతేర్చి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుప్పూర్ టీకేటీ మిల్ ప్రాంతంలోని శక్తి అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న సెంథిల్ కుమార్ (43) పారిశ్రామికవేత్త, రైతు. ఇతనికి పల్లాడం సమీపంలోని వావిపాళయం ప్రాంతంలో తోట ఉంది. ఇతని భార్య సత్య (41). కుమార్తె శివనేత్ర (15). మంగళవారం రాత్రి దంపతుల మధ్య గొడవ జరిగినట్లు తెలిసిందిది. దీంతో ఆగ్రహించిన సెంథిల్ కుమార్ భార్యను కొడవలితో నరికాడు. ఆమె అక్కడికక్నడు మృతిచెందింది. భార్యను చంపిన తర్వాత, సెంథిల్ కుమార్ పురుగల మందును శీతలపానీయంలో కలుపుకుని తాగి, ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తాను ఆత్మహత్య చేసుకునే ముందు, బుధవారం తెల్లవారుజామున తన కుటుంబ వాట్సాప్ గ్రూప్‌లో దీనికి సంబంధించిన వీడియో ఒకటి పోస్ట్ చేశాడు. బుధవారం ఉదయం 7.30 గంటలకు ఈ వీడియోను చూసిన అతని బంధువు ఒకరు షాక్ అయ్యి, వెంటనే ఇంటికి వెళ్లి చూసి పోలీసులకుసమాచారం అందించారు. పోలీసులు అక్కడికి వెళ్లి తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా, సత్య, సెంథిల్ కుమార్ ఇద్దరూ శవాలై పడి ఉన్నారు. సెంథిల్ కుమార్ ఆత్మహత్య చేసుకునే ముందు రెండు నోటు పుస్తకాల్లో 15 పేజీల సూసైడ్ నోట్‌ను గుర్తించారు. పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు.
తిరువొత్తియూరు: చైన్నె, ఎంజీఆర్ నగర్‌లో తాళం వేసి ఉన్న ఇంట్లో ఓ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు. చైన్నె ఎంజీఆర్ నగర్, గంగాయ్కొండ చోళన్ వీధికి చెందిన అబ్దుల్‌ఖాదర్(34). ఇతను పెయింటర్. మంగళవారం రాత్రి ఇతని ఇంటి నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు ఎంజీఆర్ నగర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా, అబ్దుల్ ఖాదర్ కుళ్లిన స్థితిలో శవంగా పడి ఉన్నాడు. పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం కేకే నగర్ ఈఎస్‌ఐ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.


