సాక్షి, చైన్నె: కూటమి, పార్టీ విషయంగా వచ్చే ఏ వదంతులను నమ్మ వద్దని టీవీకే అధినేత విజయ్ కేడర్‌కు సూచించారు. నాది, మనది పీపుల్స్ టీం అని, ఏ సమయంలోనూ సిద్ధాంతాల పరంగా సామారస్యానికి చోటు లేదని స్పష్టం చేశారు. మహాబలిపురం సమీపంలోని ఓ కల్యాణ మండపంలో బుధవారం సాయంత్రం ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో విజయ్ పాల్గొన్నారు. తాను సైతం ముస్లిం సోదరులతో కలిసి ఉపదీక్షను విరమంచారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో విజయ్ మాట్లాడుతూ, తాను పార్టీ ఏర్పాటు చేసినప్పుడు అనేక వదంతులు సృష్టించారని గుర్తు చేశారు. విజయ్ ఆ టీం...ఈ టీఎం అని ప్రచారం చేశారన్నారు. ఆ తర్వాత ఆ కూటమిలో చేరుతున్నారని, ఈ కూటమిలో చేరుతున్నారని మరింత తీవ్రంగానే చర్చలు జరిగే స్థాయికి ప్రచారంచేశారన్నారు. తాను ఒక్కటే చెబుతున్నానని, తనది పీపుల్స్ టీం అని, టీవీకే నేతృత్వంలోనూ అధికారం ఏర్పాటు అవుతుందని స్పష్టం చేశారు. లౌకికవాదం, సామాజిక న్యాయం అన్న సిద్ధాంతాలకు కట్టుబడి టీవీకే ఉందని, ఇందులో ఎలాంటి సామరస్యానికి చోటు లేదని స్పష్టం చేశారు. ఎవ్వరు గందగోళనికి గురి కావాల్సిన అవసరం లేదని, దేవుడి కృపతో అంతా మంచే జరుగుతుందని, విజయ్ తథ్యం అని ముగించారు.అనంతరం ముస్లింలతో కలిసి ప్రార్థన చేశారు.


