– మంత్రి దురైమురుగన్
సాక్షి, చైన్నె: తమిళనాడు నీటి వనరుల శాఖ మంత్రి దురైమురుగన్ చైన్నె నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పలు కీలక నీటి పారుదల ప్రాజెక్టులను శనివారం ప్రారంభించారు. డెల్టా జిల్లాలు, ఇతర మండలాల్లో సాగునీటి సరఫరాను మెరుగుపరిచే లక్ష్యంతో ఈ పనులు చేపట్టారు. 13 డెల్టా జిల్లాలు, మదురై, కోయంబత్తూర్ మండలాల్లోని 11 జిల్లాలు కలిపి మొత్తం 24 జిల్లాల్లో ఈ పనులు ప్రారంభమయ్యాయి. సుమారు రూ. 125 కోట్ల అంచనా వ్యయంతో, 5,954 కిలోమీటర్ల మేర నదులు, కాలువలు, చెరువులలో పూడికతీత పనులు జరగనున్నాయి. ఈ కారణంగా సుమారు 13 లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందనుంది.
కొత్త చెక్ డ్యామ్‌లకు శంకుస్థాపన
వేలూరు జిల్లా, కాట్పాడి సమీపంలోని అమ్మూండి గ్రామం వద్ద రూ. 46.44 కోట్లతో పాలారు నదిపై చెక్ డ్యామ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దీనివల్ల 600 హెక్టార్ల భూమికి ప్రయోజనం కలుగుతుంది. పొన్నై నది తీరంలోని వెప్పాలై గ్రామం వద్ద రూ. 23.08 కోట్లతో మరో చెక్ డ్యామ్ నిర్మాణానికి పునాది వేశారు. దీనివల్ల 600 హెక్టార్ల భూమి సాగులోకి వస్తుంది. జూన్ నెలలో మేట్టూరు రిజర్వాయర్‌ను సాగునీటి కోసం తెరిచినప్పుడు, నీరు చివరి ఆయకట్టు వరకు ఎలాంటి సమస్య అన్నది లేకుండా చేరాలనే ఉద్దేశంతో ఈ ఏడాది పూడికతీత పనులను ముందుగానే ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. నిధులను సద్వినియోగం చేసుకుంటూ, పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని ఇంజినీర్లను ఆయన ఆదేశించారు. నీటి వనరుల శాఖ కార్యదర్శి జె. జయకాంతన్, ప్రధాన ఇంజినీర్ గోపాలకృష్ణన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


