సాక్షి, చైన్నె : ప్రముఖ మధుమేహ నియంత్రణ సంస్థ ‘డాక్టర్ మోహన్ డయాబెటిస్ స్పెషాలిటీస్ సెంటర్’ వైద్య రంగంలో మరో కీలక అడుగు వేసింది. జీవక్రియ సంబంధిత వ్యాధుల నివారణ, నిర్వహణ కోసం జెనోమిక్ లైఫ్‌స్టైల్ కౌన్సెలింగ్ అనే వినూత్న కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించింది. ఇది వ్యక్తిగత జన్యువుల ఆధారంగా వ్యాధులను ముందుగానే గుర్తించి, తగిన జీవనశైలి మార్పులను సూచించే సరికొత్త విధానంగా అవతరించింది.ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ డాక్టర్ వి. మోహన్ మాట్లాడుతూ, ‘ప్రస్తుతం వైద్య విధానం సాధారణ చికిత్సల నుండి ఖచ్చితత్వ ఆధారిత సంరక్షణ వైపు మారుతుందన్నారు. ఒక వ్యక్తికి టైప్ 2 డయాబెటిస్, ఊబకాయం లేదా గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎంత ఉందో వారి జన్యువుల ద్వారా తెలుసుకోవచ్చు అని వివరించారు. జన్యు ప్రొఫైలింగ్ ద్వారా వ్యాధిని ముందే అంచనా వేసి, మెరుగైన ఫలితాలను అందించవచ్చు అని పేర్కొన్నారు.
జీవనశైలి మరియు జన్యువుల మేళవింపు
మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.ఎం. అంజనా ఈ ప్రోగ్రామ్ గురించి వివరిస్తూ.. ఇది కేవలం జన్యు పరీక్ష మాత్రమే కాదని, దాని ఆధారంగా ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ , ప్రవర్తనా మార్పులను సమన్వయం చేసే పకడ్బందీ ప్రణాళిక అని తెలిపారు. న్యూట్రిజెనోమిక్ కౌన్సెలర్ డాక్టర్ గీతా ధర్మట్టి మాట్లాడుతూ, జన్యువులకు , మనం తీసుకునే పోషకాహారానికి మధ్య ఉన్న సంబంధాన్ని బట్టి డైట్ ప్లాన్ రూపొందిస్తామని చెప్పారు. దీనివల్ల రోగులు తమ శరీరతత్వానికి సరిపడే ఆహారాన్ని ఎంచుకోవడం సులభం అవుతుందని ఆమె వివరించారు.


