యూపీఎస్సీ ఆశావహులకు వరంగా మారిన వైనం ఆ పథకం ద్వారా పెద్దఎత్తున అభ్యర్థుల లబ్ధి సివిల్ సర్వీస్ పరీక్షల్లో 56 మంది జయకేతనం
సాక్షి, చైన్నె: తమిళనాడు ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం ’నాన్ ముదల్వన్’ అద్భుత ఫలితాలను సాధించింది. తాజాగా విడుదలైన సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో ఈ పథకం కింద శిక్షణ పొందిన 56 మంది అభ్యర్థులు విజయం సాధించి కొత్త రికార్డు సృష్టించారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు అండగా నిలుస్తూ, వారి కలలను సాకారం చేయడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తోంది. దీంతో పలువురు అభ్యర్థులు నాన్ మొదల్వన్ పథకంపై ప్రశంసల వర్షం కురిపించారు.
వైద్య విద్యార్థి నుంచి సివిల్ సర్వెంట్ వరకు..
రాజా మొహిద్దీన్ ప్రస్తుతం చెంగల్పట్టు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. కష్టతర మైన వైద్య విద్యను అభ్యసిస్తూనే, సమాంతరంగా సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమై తొలి ప్రయత్నంలోనే విజయం సాధించడం విశేషం. కాగా, తమిళ భాషలో రాసి విజయం ధర్మపురి జిల్లా అరూర్‌కు చెందిన అరుణ్ కుమార్ అనే అభ్యర్థి జాతీయస్థాయిలో 585వ ర్యాంకును సొంతం చేసుకున్నారు. ఆయన పేర్కొంటూ, తొలుత ఇంగ్లీష్‌లో రాయడానికి యత్నించానని, చివరకు తమిళ భాషలోనే మెయిన్స్ పరీక్ష రాశానని వివరించారు. మాతృభాషలో రాయడంతో తన సమాధానాలను స్పష్టంగా వ్యక్త పరిచినట్టు వివరించారు. అలాగే రామనాథపురం జిల్లా పరమకుడికి చెందిన థానేశ్వర్ పదేళ్ల నిర్విరామ పోరాటానికి ఫలితంగా నాన్ మొదల్వన్ ఇచ్చిన ప్రోత్సాహంతో ఈసారి సివిల్ సర్వీసులో సాధించాడు. థానేశ్వర్ పేర్కొంటూ, జీవన్మరణ పోరాటంలా ఈసారి పరీక్ష రాశానని, ఒక పెద్ద పర్వతాన్ని అధిగమించిన అనుభూతి కలుగుతోందన్న ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ విజయం తన కుటుంబానికి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.. అని ఉద్వేగంగా చెప్పారు.
నాన్ మొదల్వన్ పథకంలో శిక్షణ పొంది సివిల్స్‌లో ర్యాంక్ సాధించిన అభ్యర్థులు
ఆర్థిక అడ్డంకులను.. అధిగమించి..
ధర్మపురి జిల్లాకు చెందిన అరుణ్ కుమార్ వంటి అనేక మంది అభ్యర్థులు పేదరికాన్ని జయించి ఈ స్థాయికి చేరుకున్నారు. నాన్ మొదల్వన్ పథకం ద్వారా అందిన ఆర్థిక సహాయం, నాణ్యమైన శిక్షణ, నిరంతర ప్రోత్సాహం వల్లే తమకు ఈ విజయం సాధ్యమైందని విజేతలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.కాగా, నాన్ ముదల్వన్ పథకం ముఖ్యంగా గ్రామీణ, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు సివిల్ సర్వీసెస్ వంటి ఉన్నత స్థాయి పరీక్షల కోసం ఉచిత శిక్షణ, ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. తమిళనాడు నుంచి పరీక్ష రాసిన వారిలో జాతీయ స్థాయిలో 2, 7, 18, 181, 197, 213, 225, 227, 230, 291, 320, 407, 410, 411, 439, 440, 459,485,486 ర్యాంకులు సాధించిన వారు నాన్ మొదల్వన్ ద్వారా శిక్షణ పొందిన వారుగా ఉండటం విశేషం. వీరిలో వరసుగా రాజేశ్వరి, రాజా మొహిద్దీన్, శృతి, రేష్మ, ఎం కృత్రిక, అరుణ్ పాండియన్, ముత్తరసి, మహంతి, ఇందుమతి, అరుణ్ ప్రకాష్, మౌళిశ్వరన్, సహిత ఎస్, కృపాకరన్, రంజిత్‌కుమార్, హిందుజా, షేక్ మహ్మద్, నివేద్‌కుమార్ ఉన్నారు. వీరితో పాటూ విజేతలలో మరి కొందరు సైతం నాన్ మొదల్వన్ ద్వారా శిక్షణ పొందిన వారు కావడం గమనార్హం. ఈసారి పరీక్ష రాసిన జయకేతనం ఎగుర వేసినా వారిలో అత్యధిక మంది ఐదు, ఎనిమిది, పది సంవత్సరాల నిర్విరామ పోరాటానికి ఫలితంగా తాజాగా ఉత్తీర్ణత సాధించడం గమనార్హం.
రాష్ట్ర ప్రభుత్వం నాన్‌మొదల్వన్ పథకం విద్యార్థులు, పోటీపరీక్షలు హాజరయ్యే అభ్యర్థులకు వరంగా మారింది. ఇందులో శిక్షణ పొందిన వారిలో ఎందరో తాజాగా సివిల్ సర్వీసు పరీక్షలలో జయకేతనం ఎగురవేశారు. తమిళనాడు నుంచి 56 మంది ఎంపికై రికార్డు సృష్టించారు. వీరిలో మదురై మణిహారంగా రాజేశ్వరి జాతీయ స్థాయిలో రెండవ ర్యాంకును, రాజా మొహిద్దీన్ 7వ ర్యాంకును సొంతం చేసుకోవడం విశేషం.


