సరిహద్దులకు సగర్వంగా.. | - | Sakshi
Sakshi News home page

సరిహద్దులకు సగర్వంగా..

Mar 8 2026 7:58 AM | Updated on Mar 8 2026 7:58 AM

● ఓటీఏలో వీరత్వాన్ని చాటిన పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌

సాక్షి, చైన్నె: ఏడాది కాలంగా కఠోర శిక్షణను ముగించుకున్న యువ అధికారులు ఆర్మీలో దేశసేవకు సన్నద్ధమయ్యారు. ఇందులో 27 మంది మహిళా క్యాడెట్లు ఉన్నారు. సరిహద్దుల్లో విధుల నిమిత్తం చైన్నె నుంచి బయలు దేరేందుకు ముందుగా ఈ యువ అధికారులు ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలో జరిగిన పరేడ్‌లో తమ ప్రతిభను చాటుకున్నారు. వివరాలు.. చైన్నెలోని సెయింట్‌ థామస్‌ మౌంట్‌ ఆర్మీ అధికారుల శిక్షణ అకాడమీ నుంచి ఏటా యువ అధికారులు దేశ సేవకు అంకితం అవుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మొత్తం 345 మంది ఆఫీసర్‌ క్యాడెట్లు శిక్షణ పూర్తి చేశారు. వీరిలో 318 మంది యువ అధికారులు, 27 ఆఫీసర్‌ క్యాడెట్లు (మహిళలు) భారత సైన్యం సేవలకు ఎంపికయ్యారు. అలాగే, స్నేహపూర్వక సంబంధాల మేరకు మిత్ర దేశాలైన భూటాన్‌, టాంజానియా నుంచి ఇద్దరు యువ అధికారులు, ఇద్దరు మహిళా క్యాడెట్లు ఇక్కడ శిక్షణ పూర్తి చేశారు. అంతర్జాతీయ సరిహద్దులలో స్నేహం, సహకార బంధాలను పెంపొందించేందుకు సిద్ధమయ్యారు. శిక్షణ ముగించి, దేశ సేవకు తమను అంకితం చేసుకునే విధంగా శనివారం వీరి పరేడ్‌ జరిగింది.

శిక్షణా కాలంలో వీరు నేర్చుకున్న సాహసాలను శుక్రవారం ప్రదర్శనలో ఆహుతుల ముందు క్యాడెట్లు ప్రదర్శించారు. పరేడ్‌లో వీరత్వాన్ని చాటుకున్నారు. సెయింట్‌ థామస్‌ మౌంట్‌లోని ఓటీఏ అకాడమీ ఆవరణలో ఉన్న పరమేశ్వరన్‌ డ్రిల్‌ స్క్వైర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో యువ అధికారులు ఆహుతుల్ని మెప్పించారు. పరేడ్‌ అనంతరం దేశ సేవకు తమను అంకితం చేసుకుంటూ ప్రతిజ్ఞ చేశారు. దేశానికి నిస్వార్థ సేవ అందిస్తామని, విలువలకు కట్టుబడి ముందుకు సాగుతామన్న నినాదాల్ని యువ అధికారులు మార్మోగించారు. మంత్రముగ్ధులను చేసే మార్షల్‌ ట్యూన్‌లకు అనుగుణంగా ఆఫీసర్‌ క్యాడెట్‌ల కవాతు అందరినీ ఆకట్టుకుంది. శిక్షణ నైపుణ్యంతో థ్రిల్లింగ్‌ కంబైన్డ్‌ డిస్‌ప్లే విన్యాసాలను నిర్వహించారు. అకాడమీ హార్స్‌ రైడింగ్‌ క్లబ్‌ క్యాడెట్‌లు, రైడింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌లచే ఈక్వెస్ట్రియన్‌ డిస్‌ప్లేతో ప్రదర్శన జరిగింది. నైపుణ్యాలను చాటే విధంగా ఉత్కంఠభరితమైన యుక్తులను క్యాడెట్లు ప్రదర్శించారు. వీక్షకులలో ఉత్సాహాన్ని నింపే విధంగా క్యాడెట్లు , ఫిజికల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌లచే చక్కటి సమన్వయంతో కూడిన ప్రదర్శనలను అందించారు. పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ ను పశ్చిమ కమాండ్‌ జనరల్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ మనోజ్‌కుమార్‌ కటియార్‌ పర్యవేక్షించారు. విశిష్ట సేవా పతకం, ఉత్తమ యుద్ధ సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం, విశిష్ట సేవా పతకాలను సమీక్షించారు. శిక్షణలో అత్యుత్తమ పనితీరు ప్రదర్శించిన వారిని మనోజ్‌ కుమార్‌ కటియార్‌ సత్కరించారు. ఏసీఏ పియూష్‌ బిప్త్‌కు స్వోర్డ్‌ ఆఫ్‌ హానర్‌ ప్రదానం చేశారు. ఓసీ చిరాగ్‌కు బంగారు పతకం, బీయూఓ పుష్పింద్ర రాథోడ్‌కు వెండి పతకం, ఏసీఏ పియూష్‌ బిప్త్‌కు కాంస్య పతకం అందజేశారు. యువ అధికారులకు నియామక ఉత్తర్వుల పంపిణీకి సంబంధించి ‘స్టార్స్‌’ గుర్తింపును అందజేశారు.

ఉత్సాహంగా పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌..

Advertisement
 
Advertisement
Advertisement