సాక్షి, చైన్నె : మదురై వేదికగా మాజీ సీఎం పన్నీరు సెల్వం తన బలాన్ని చాటుకున్నారు. వేలాది మందితో కలిసి డీఎంకేలో చేరారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం స్టాలిన్ మాట్లాడుతూ అన్నాడీఎంకే రక్తాన్ని పీల్చే జలగ బీజేపీ అని ధ్వజమెత్తారు. బిహార్ సీఎం నితీశ్‌కుమార్‌కు పట్టిన గతే త్వరలో పళణిస్వామికి పట్టబోతోందన్నారు. మాజీ సీఎం పన్నీరు సెల్వం, ఆయన కుమారుడు రవీంద్రనాథ్ ఇటీవల డీఎంకేలో చేరిన విషయం తెలిసిందే. అధికారికంగా డీఎంకేలో తమ మద్దతుదారులతో చేరేవిధంగా బల ప్రదర్శన బహిరంగ సభను శనివారం మదురైలో నిర్వహించారు. వేలాదిగా తరలి వచ్చిన మద్దతుదారులతో కలిసి డీఎంకేలో చేరారు. తేని, దిండుగల్,మదురై, తూత్తుకుడి, రామనాధపురం జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పన్నీరు సెల్వం మద్దతు దారులు బయటకు రావడంతో అనేక ప్రాంతాలలో అన్నాడీఎంకేకు ముఖ్యనేతలు కరువైనట్టుగా పరిస్థితి నెలకొంది. సీఎం స్టాలిన్ ఈ బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పన్నీరు సెల్వం వలే తాను కూడా ఎంజీఆర్‌కు వీరాభిమానిగా పేర్కొన్నారు. అన్నాడీఎంకే రక్తాన్ని పూర్తిగా పీల్చే జలగగా బీజేపీ మారిందన్నారు. అన్నాడీఎంకే త్వరలో గల్లంతు కానున్నట్టు వ్యాఖ్యలు చేశారు. నితీష్‌కుమార్‌కు బిహార్‌లో పట్టిన గతే పళణిస్వామికి పట్టబోతోందన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గ్యాస్ ధరలను అమాంతంగా పెంచి మహిళా దినోత్సవ వేళ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కానుక అందచేసిందన్నారు. పన్నీరు సెల్వం మాట్లాడుతూ, అడ్డదారిలో వచ్చిన వాళ్లు అహంకార పూరితంగా వ్యవహరిస్తూ, అన్నాడీఎంకే సర్వనాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం స్టాలిన్ తమిళనాడును రక్షించే దళపతి అని, అందుకే ఆయనతో కలిసి పయనించేందుకు డీఎంకేలో చేరినట్టు ప్రకటించారు.


