కీల్పాకం ఆస్పత్రిలో కలకలం
సాక్షి, చైన్నె: చైన్నె కీల్పాకం ఆస్పత్రిలో సోమవారం ఉదయం కలకల రేగింది. ఓ రౌడీని అతి దారుణంగా ఓ ముఠా ఆస్పత్రి ఆవరణలో హతమార్చింది. చైన్నె కీల్పాకం ఆస్పత్రి నిత్యం రోగులతో కిటకిటలాడుతుంటుందన్న విషయం తెలిసిందే. ఈ ఆస్పత్రిలోని ప్రసవ వార్డులో రోగుల బంధువుల విశ్రాంతి కోసం కేటాయించిన స్థలంలో నిద్రిస్తున్న ఓ యువకుడిని ఐదుగురితో కూడిన ఓ ముఠా అతి కిరాతకంగా కత్తులతో దాడి చేసి ఉడాయించింది. ఈ సంఘటనతో అక్కడున్న వారంతా ఆందోళనతో పరుగులు తీశారు. రక్తపు మడుగులో ఆ యువకుడు మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి విచారణను వేగవంతం చేశారు.
ప్రేయసి కోసం వచ్చి
విచారణలో హతుడు రౌడీ ఆది(20)గా గుర్తించారు. కొళత్తూరు మహాత్మా గాంధీ నగర్‌కు చెందిన ఇతడిపై హత్య తదితర కేసులు ఉన్నాయి. ఆవడిలోని సుచిత్ర(21)తో వివాహేతర సంబంధాన్ని ఇతడు కొనసాగిస్తూ వచ్చినట్టు సమాచారం. ఈ పరిస్థితులలో తన బిడ్డ మరణించాడంటూ ఆదికి సుచిత్ర సమాచారం పంపించింది. దీంతో ఆస్పత్రిలో ఉన్న తన ప్రేయసిని చూసేందుకు ఆదివారం రాత్రి కీల్పాకంకు ఆది వచ్చాడు. ఆమెను పరామర్శించి తిరుగు పయనం అయ్యే సమయంలో అర్ధరాత్రి వేళ బయటకు వెళ్లడం మంచిది కాదని, సుచిత్ర, ఆమె బంధువు మది(21) వారించారు. దీంతో ఆస్పత్రి ఆవరణలో ఉన్న రోగుల బంధువులు వేచి ఉండే ప్రాంతంలో నిద్రకు ఆది ఉపక్రమించాడు. ఈ పరిస్థితులలో సోమవారం వేకువ జామున మూడుగంటల సమయంలో గుర్తుతెలియని ముఠా అతడ్ని హతమార్చింది. ఈ హత్యలో సుచిత్ర, మది ప్రమేయం ఉండవచ్చు అన్న అనుమానాలు నెలకొన్నాయి. వారి వద్ద విచారణ జరుపుతున్నారు. పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు తొమ్మిది బృందాలను అదనపు కమిషనర్ నరేంద్ర నాయర్ రంగంలోకి దించారు. సంఘటనా స్థలంలో పరిశీలించారు. అక్కడి సీసీ టీవీఫుటేజీల ఆధారంగా నిందితుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. నిత్యం రద్దీతో చైన్నె నగరంలో ప్రధాన ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ ఘటన జరగడం కలకలం రేపింది. రాష్ట్ర రాజధాని నగరం ఆస్పత్రిలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం బట్టి చూస్తే, పోలీసు పనితీరు ఏ మేరకు ఉందో స్పష్టం అవుతోందని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి, పీఎంకే నేత అన్బుమణి, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్ విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.


