త్వరలో కూటమిలోకి కొత్త పార్టీ
సాక్షి, చైన్నె: తమ కూటమిలోకి త్వరలో కొత్త పార్టీ వచ్చి చేరనున్నట్టు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిపళణి స్వామి వ్యాఖ్యానించారు. ఇది కాస్త రాజకీయంగా చర్చకు దారి తీసింది. తమిళనాడులో కొత్తగా ఆవిర్భవించిన అతి పెద్ద, జనాదరణ కలిగిన పార్టీగా విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రికళగం ఉంది. ఈ పార్టీని తమ కూటమిలోకి తెచ్చుకునేందుకు బీజేపీ తీవ్రంగానే ప్రయత్నిస్తోంది. అన్నాడీఎంకే కూటమిలో బీజేపీ ఉన్న విషయం తెలిసిందే. అదే సమయంలో విజయ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న తాజా పరిణామాల వెనుక కేంద్రంలోని బీజేపీ ఉన్నట్టుగా చర్చ ఊపందుకుంది. సోమవారం విజయ్ సీబీఐ విచారణకు హాజరు కావడం, ఆయన నటించిన జననాయకన్ చిత్రం విడుదల వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడం వంటి పరిణామాల నేపథ్యంలో పళణిస్వామి చేసిన వ్యాఖ్య ఆసక్తికరంగా మారింది. సోమవారం సాయంత్రం ఆయన పార్టీ కార్యాలయం ఎంజీఆర్ మాళిగైలో మీడియాతో మాట్లాడుతూ, అన్నాడీఎంకే కూటమి మెగా కూటమిగా మారబోతోందన్నారు. త్వరలో కొత్త పార్టీ కూటమిలోకి రానున్నట్టు ప్రకటించారు. మరికొన్ని రోజులలో ఈ పార్టీ వచ్చి చేరుతుందన్నారు. అధికారంలో అన్నాడీఎంకేదే, సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేస్తాం అని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఆయన కొత్త పార్టీ అని విజయ్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసి ఉంటారన్న చర్చ ఊపందుకుంది.


