మదురైకు చేరిన వైగో యాత్ర
సాక్షి, చైన్నె: తిరుచ్చి నుంచి ఎండీఎంకే అధినేత వైగో చేపట్టిన పాదయాత్ర మదురైకు చేరింది. సోమవారం మదురై శివారులలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. మాదక ద్రవ్యాల నియంత్రణ, మత రాజకీయాలకు చెక్ పెట్టడం లక్ష్యంగా, సమిష్టి సామరస్యంతో అడుగులు వేద్దామన్న నినాదంతో ఎండీఎంకే నేత వైగో తిరుచ్చి నుంచి మదురైకు సమానత్వ పాదయాత్ర చేపట్టారు. ఈ యాత్ర తిరుచ్చిలో 2వ తేదీన ప్రారంభమైంది. దీనిని సీఎంస్టాలిన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ యాత్రకు డీఎంకే కూటమి పార్టీల నేతలందరూ హాజరయ్యారు. రోజుకు 15 నుంచి 17 కి.మీదూరం ప్రయాణించే విధంగా ఈయాత్ర జరిగింది. ఎండీఎంకే నేత వైగో, ఆపార్టీ ఎంపీ దురై వైగోలతో పాటూ ఐదు వందల మంది పుదుకోట్టై, శివగంగై జిల్లాల మీదుగా మదురైకు చేరుకున్నారు. సోమవారం ఉదయం మదురై మేలూరు వద్ద వైగో యాత్రను మంత్రి పీటీఆర్ పళణి వేల్ త్యాగరాజన్‌తో పాటుగా, ఎండీఎంకే నేతలు, డీ ఎంకే కూటమి పార్టీల నేతలు ఆహ్వానించారు. ఈ యాత్ర తెప్పకుళం, అన్నానగర్, లోయర్ ఔటర్ రడ్డు, ఒత్తకడై మీదుగా నిర్వహించారు. మదురైలో మంగళవారం కూడా ఈయాత్ర సాగే అవకాశాలు ఉన్నాయి.


