రాజపాళయం నుంచి పోటీకి రెడీ
సాక్షి, చైన్నె: రాజ పాళయం నుంచి అన్నాడీఎంకే అభ్యర్థిగా పోటీ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు సినీనటి, ఆ పార్టీ మహిళా నేత గౌతమి తెలిపారు. తనకు పార్టీ ప్రధాన కార్యదర్శి పళణి స్వామి అవకాశం ఇస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అన్నాడీఎంకేలో ఎన్నికలలో పోటీ చేయడానికి దరఖాస్తులు సమర్పించిన ఆశావహులకు ఇంటర్వ్యూలు చైన్నెలో జరుగుతున్న విషయం తెలిసిందే. మంగళవారంతో ఈ ఇంటర్వ్యూలు ముగిసే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికలలో పోటీ చేయాలన్న ఉత్సాహంతో ఉన్న ఆశావహులను స్వయంగా పళణి స్వామి నేతృత్వంలోని కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నది. ఈ ఇంటర్వ్యూకు సినీ నటి గౌతమి, మరో నటి గాయత్రి రఘురాంలు వేర్వేరుగా హాజరయ్యారు. ఇంటర్వ్యూ అనంతరం మీడియాతో గౌతమి మాట్లాడుతూ, అన్నాడీఎంకే తరపున రాజ పాళయం నుంచి తాను పోటీ చేయడానికి ఉత్సాహం చూపుతున్నట్టు వ్యాఖ్యానించారు. తనకు వందకు వంద శాతం ఇక్కడ గెలుపు అవకాశాలు ఉన్నాయన్నారు. రాజపాళయం తనకు కొత్త కాదని, ఇక్కడి వారితో మమేకమై ఉన్నట్టుపేర్కొన్నారు. తనకు పార్టీ ప్రధాన కార్యదర్శి పళణిస్వామి అవకాశం ఇస్తార న్న నమ్మకంతో ఉన్నట్టు ధీమా వ్యక్తంచేశారు. కూటమి పార్టీ బీజేపీకి ఈ స్థానం వెళ్లిన పక్షంలో అని ప్రశ్నించగా పార్టీ ప్రధాన కార్యదర్శి నిర్ణయానికి కట్టుబడి తన పయనం ఉంటుందని, ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా, శిరసా వహిస్తానని స్పష్టం చేశారు.


