
మీతో స్టాలిన్ పథకానికి స్పందన
తిరుత్తణి: తిరుత్తణిలో గురువారం నిర్వహించిన మీతో స్టాలిన్ పథకానికి విశేష స్పందన లభించింది. ప్రభుత్వ పథకాలు ఒకే స్థలంలో ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా మీతో స్టాలిన్ పథకం ద్వారా శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తిరుత్తణి మున్సిపాలిటీలోని 5, 14, 15వ వార్డులకు సంబంధిచి ప్రయివేటు కల్యాణ మంపడంలో శిబిరం నిర్వహించారు. శిబిరంలో 15 శాఖల నుంచి అధికారులు పాల్గొని ఆన్‌లైన్ సేవలు అందించారు. ఇందులో పట్టణంలోని మూడు వార్డులకు సంబందించిన ప్రజలు ఇంటి పట్టాలు, వృద్ధాప్య పింఛన్ల కోసం అధికారుల వద్ద వినతిపత్రాలు అందజేశారు. అధికారులు వినతిపత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసుకుని రసీదులు అందజేశారు. శిబిరాన్ని తిరుత్తణి ఎమ్మెల్యే చంద్రన్ ప్రారంభించారు. అలాగే మున్సిపల్ చైర్‌పర్సన్ సరస్వతి, వైస్ చైర్మన్ సామిరాజ్ పాల్గొని శిబిరాన్ని పరిశీలించారు. అర్హులుగా ఎంపిక చేసిన వారికి ప్రభుత్వ సర్టిఫికెట్లు అందజేశారు. ఆర్డీఓ కణిమొళి, డీఎస్పీ కందన్, అధికారులు పాల్గొన్నారు.
మీతో స్టాలిన్ పథకానికి బారులు
వేలూరు: వేలూరు ఉమ్మడి జిల్లాలో నిర్వహిస్తున్న మీతో స్టాలిన్ పథకానికి అర్జీదారులు బారులు దీరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మీతో స్టాలిన్ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ఈ పథకంలో అన్ని శాఖల అధికారులు ఒకే ప్రాంతానికి చేరి ప్రజల నుంచి వినతులు స్వీకరించి వాటిని 20 రోజుల్లో పరిష్కరించాలనే ప్రభుత్వం నిబందన విధించింది. దీంతో ప్రతి గ్రామ పంచాయతీలో నిర్వహిస్తున్న మీతో స్టాలిన్ పథకానికి గ్రామస్తులు వారి పనులను వదులుకొని అర్జీలు చేత బట్టి అధికారుల వద్ద అందజేస్తున్నారు. గురువారం ఉదయం కాట్పాడి యూనియన్ పరిధిలో సేవూరు గ్రామ పంచాయతీ, కన్నియంబాడి యూనియన్ పరిధిలోని తుత్తిపట్టు గ్రామ పంచాయతీలో ఈ పథకం జరిగింది. ఇందులో సర్పంచ్ రవిచంద్రన్ వద్ద వినతులు అందజేశారు. ఆయనతో పాటు యూనియన్ చైర్మన్ దివ్య, బ్లాక్ డెవలప్‌మెంట్ అధికారి సత్యమూర్తి, గ్రామ పరిపాలన అధికారి విజయ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మీతో స్టాలిన్ పథకానికి స్పందన