
రాయపురం, నుంగంబాక్కంలలో ఫుడ్ కోర్టులు
ఖాదర్నవాజ్ ఖాన్ రోడ్డు నమూనా
● రెండు మార్గాల ఎంపిక
సాక్షి, చైన్నె: రాయపురం, నుంగంబాక్కంలో ఫుడ్‌కోర్టుల ఏర్పాటుకు కార్పొరేషన్ నిర్ణయించింది. ఇందుకోసం రెండు మార్గాలను ఎంపిక చేసి పూర్తిగా ఆ మార్గాలు సుందరంగా తీర్చిదిద్దేందుకు సిద్ధమయ్యారు. చైన్నె టీనగర్‌లోని పాండిబజార్ రోడ్డులో పెద్ద పెద్ద ఫుట్‌పాత్‌లు అక్కడక్కడ సుందరంగా కనిపించే దృశ్యాలు, విద్యుత్ వెలుగులతో ఆకర్షిణీయంగా తీర్చిదిద్దారు. ఇదే తరహాలో నగరంలో అనేక ప్రధాన ప్రాంతాలను తీర్చిదిద్దేందుకు అధికారులు కసరత్తులు చేపట్టారు. ఇందులోభాగంగా రోడ్ల మీద ఉన్న ఫుట్‌పాత్ దుకాణాలను క్రమబద్ధీకరించడంతో పాటు కొన్ని మార్గాలను ఎంపిక చేసి ఫుట్కోర్టులతో ఆహ్లాదకరంగా ఆ పరిసరాలు ఉండే విధంగా తీర్చిదిద్దే పనులకు కార్యాచరణ సిద్ధం చేశారు. నగరంలో అనేక ప్రాంతాల్లో సుందరమార్గం, ఫుట్ కోర్టులతో ఆ పరిసరాలు ఓ పర్యాటకం, ఆహ్లాదకరంగా ఉండే దిశగా చర్యలు చేపట్టారు. తాజాగా నుంగంబాక్కం, రాయపురంలను ఎంపిక చేశారు. నుంగంబాక్కంలోని ఖాదర్ నవాజ్ ఖాన్ రోడ్డు, రాయపురంలోని ఎంసీ రోడ్డును పూర్తిగా సుందరీకరీంచనున్నారు. ఈ మార్గాలను సుందరంగా తీర్చిదిద్ది, ఫుడ్‌కోర్టులు, ఇతర దుకాణాలకు చర్యలు చేపట్టారు. ఈ దుకాణాలన్నీ 24 గంటల పాటు పనిచేస్తాయి. ఈ రోడ్లలో పార్కింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు, పచ్చదనంతో ఆహ్లాదకర వాతావరణం సృష్టించే విధంగా నమూనాను సిద్ధం చేశారు.